బీఆర్‌ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శలు
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా ఢిల్లీ చుట్టూ తిరగడం, పదవుల కోసం పాకులాడటం తప్ప ప్రజా సమస్యలు పట్టించుకునే వారే లేరని బీఆర్‌ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌పై నిందలు వేయడం, అప్పులు చేయడం తప్ప ఇంతవరకు చేసిందేమీ లేదని విమర్శించారు. రూ. 38వేల కోట్లు తెచ్చి ఒక పథకం అమలు చేయకుండా దోచుకునే పనిలో పడ్డారని పేర్కొన్నారు. ప్రతినెల రూ. 13వేల కోట్ల ఆదాయం రావాలి.. కానీ గడిచిన నెలల్లో రూ.10వేల కోట్లు మాత్రమే రావడం రాష్ట్రం దివాళా తీస్తున్నట్లేనని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగం కాంగ్రెస్ పాలనలో పూర్తిగా పడిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడులకు వ్యాపారులు ముందుకు రావడం లేదని, ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంటున్నదన్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరు సిద్ధంగా లేరని, ఇచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.