25-02-2025 12:00:00 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, ఫిబ్రవరి 24 : కాంగ్రెస్ నాయకులవి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, బీఆర్‌ఎస్ హయాంలో పూర్తి చేసిన పార్కులను ఇప్పటికీ ప్రారంభించలేదని, తన ఆరోగ్యంపై కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని కేబీఆర్ గార్డెన్స్లో సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2023 నవంబర్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు, ఎల్బీనగర్ నియోజకవర్గంలో 15 కొత్త పార్కులను మంజూరు చేశామని, ఎన్నికల నిబంధనల కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడిందని తెలిపారు. కొన్నింటికి కోర్టు వ్యవహారాలు కారణమని, మరో 6 పార్కులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచినా, కొన్ని పార్కులను ప్రారంభించకుండా తాళాలు వేసి ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇన్ చార్జి మంత్రి ప్రారంభిస్తామన్నప్పటికీ, ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకులకు అపాయిం ట్మెంట్ దొరకలేదా? అని ఎద్దేవా చేశారు.
పార్కులు ప్రారంభమైతే తనకు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ నాయకులు భయపడి అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. మరో రెండు రోజుల్లో పార్కులు ప్రారంభించకపోతే, తానే స్వయంగా వెళ్లి తాళాలు తెరిచి ప్రజలకు పార్కులను అందుబాటులోకి తీసుకువస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు నిధులు తేవడంలో విఫలమయ్యారు అని విమర్శించారు.
ఎన్నికల ముందు మేము మంజూరు చేసిన అభివృద్ధి పనులను కూడా అడ్డుకున్నారన్నారు.. కోట్ల రూపాయల నిధులతో కామినేని ఫ్లైఓవర్ క్రింద ఆక్సిజన్ విడుదల చేసే దాదాపు 26 రకాల మొక్కలు మొత్తం 36,000 మొక్కలను నాటించామని, వాటిని ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని గుర్తు చేశారు.
అప్పటి కమిషనర్ పార్కులో టిక్కెట్ విధించాలని నిర్ణయించగా, తాను నిరాకరించానని తెలిపారు. ప్రస్తుత జోనల్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జీవో 118, లారీల అడ్డా విషయంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని రోజులుగా తన ఆరోగ్యం బాగోలేనప్పటికీ, నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తూనే ఉన్నానని తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకుని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు రవి ముదిరాజ్, టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి, రుద్ర యాదగిరి, జగదీశ్ గౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి, కడమంచి ఆనంద్, సదానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.