25-03-2025 05:50:22 PM
బతకడానికి వేసుకున్న గుడిసె కూల్చేసి తమ భూమి అంటూ బెదిరిస్తున్నాడని మహిళ రమాదేవి ఆరోపణ..
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని ఒకటవ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, మాజీ టిడిపి కౌన్సిలర్ పొట్ల సురేష్ వేధింపుల నుండి తమకు రక్షణ కల్పించాలని కన్నాల బస్తికి చెందిన బండి రమాదేవి కుటుంబ సభ్యులు వేడుకున్నారు. మంగళవారం వారు బెల్లంపల్లిలోని ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. కన్నాల బస్తిలోని ఒకటో వార్డులో 30 ఏళ్ల కిందట తమకు ఆ ప్రాంతంలో 8 కుటుంబాలు నివసించాయని తెలిపారు. త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తడంతో ఇల్లను విడిచి అదే ప్రాంతంలో అద్దెకు నివసిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు పెరిగిపోవడంతో మళ్లీ తాము నివసించిన పాత భూమిలో గుడిసె వేసుకుంటే స్థానికుడైన పొట్ల సురేష్ అనే నాయకుడు తమను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన చెందారు.
తాము గుడిసె వేసుకున్న భూమి మొత్తం తనదేనంటూ నకిలీ పత్రాలు చూపిస్తున్నాడని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు దృష్టికి కూడా తీసుకువచ్చామని తెలిపారు. గత నాలుగు రోజులుగా మున్సిపల్ సిబ్బంది, సింగరేణి సెక్యూరిటీ అధికారులు కన్నాల బస్సులోని తమ గుడిసె వద్దకు వచ్చి తొలగించే ప్రయత్నాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నాయకుడు పొట్ల సురేష్ తమ గుడిసె వద్దకు వచ్చి సెల్ తో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి ఈ భూమి తనదేనంటూ బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కాంగ్రెస్ నాయకుల వద్ద కు వెళ్లి చెప్పిన తనను ఎవరు ఏమి చేయలేరంటూ నానా హంగామా చేశాడని వారు వాపోయారు.
తాము అత్యంత నిరుపేదలమని, ఉండడానికి కనీసం పూరి గుడిసె కూడా లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. మున్సిపల్,సింగరేణి అధికారులు తమకు సహకరించాలని వారు వేడుకున్నారు. తమ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్న నాయకుడు పొట్ల సురేష్ పై చర్యలు తీసుకోవాలని వారు అధికారులను వేడుకున్నారు. సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులు చిలుక సాయికిరణ్, చిలుక దీక్ష రామ్షి లు పాల్గొన్నారు.