calender_icon.png 26 December, 2024 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్‌ను అవమానించింది కాంగ్రెస్సే

26-12-2024 02:04:52 AM

  1. ఎమర్జెన్సీలో వారి తీరును రాహుల్ తెలుసుకోవాలి
  2. వాజ్‌పేయి జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 
  3. రాజ్యాంగ నిర్మాతకు భారతరత్న ఎందుకివ్వలే?
  4. కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ‘అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్ పార్టీ.. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించారు.. మంత్రిగా ఉంటే రాజీనామా చేయించిన ఘనత నెహ్రూకే దక్కుతుంది’ అని కేంద్రం బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేసింది.. వాజ్‌పేయి ఏ విధంగా ప్రతిస్పందించారనే విషయం అందరికీ తెలుసని ఆయన గుర్తు చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవం పేరిట బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, పార్టీ నేతలతో కలిసి వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికహక్కు లేదన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్టులు సహా ఎందరినో జైల్లో పెట్టిన విషయాన్ని రాహుల్‌గాంధీ తెలుసుకోవాలన్నారు.

రాజ్యాంగం, అంబేద్కర్ గురించి కాంగ్రెస్ సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదన్నారు. ఇందిరాగాంధీకి భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అంబేద్కర్‌కు ఇవ్వలేదన్నారు. వాజ్‌పేయి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన పోరాటమే స్ఫూర్తిగా.. ఏడాది పాలనలో కాంగ్రెస్ నిజ స్వరూపం, ప్రజాస్వామ్య వ్యతిరేక, నియంతృత్వ చర్యలు, అవినీతి రాజకీయాలపై ఇంటింటికీ వెళ్లి వివరిస్తామన్నారు. శత జయంతి ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. 

ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలు: ఎంపీ లక్ష్మణ్

వాజ్‌పేయి ప్రధానిగా దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఎంపీ కె లక్ష్మణ్ తెలిపారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు నడిపిన మహోన్నత వ్యక్తి అటల్ బిహారీ వాజ్‌పేయి అని కొనియాడారు. నేడు రాజకీయాల్లో రంగులు మార్చే నాయకులను చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని విమర్శించారు.

రాష్ర్టంలో ఏ పార్టీ నాయకులు మంత్రులవుతున్నారో.. ఏయే పార్టీల నాయకులు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో తెలియని దయనీయ పరిస్థితి నెలకొన్నదని ఎద్దేవా చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేసినట్టు ఆయన తెలిపారు. మోదీ నాయతక్వంలో దేశంలో మూడు పర్యాయాలు బీజేపీ అధికారంలోకి రావడమనేది ఒక చరిత్ర అని.. ఇటువంటి ఘనత వాజ్‌పేయి, మోదీకే సాధ్యమైందన్నారు.

రాజ్యాంగాన్ని అవమానపర్చింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. అనంతరం బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ పాల్గొన్నారు. 

బహుముఖ ప్రజ్ఞాశీలి వాజ్‌పేయి: ఎంపీ అనురాగ్ ఠాకూర్

అటల్ జీ బహుముఖ ప్రజ్ఞాశీలి అని ఎంపీ అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. వాజ్ పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. అణ్వస్త్ర దేశంగా గుర్తింపు పొంది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందన్నారు. మన దేశాన్ని విమర్శించిన అంతర్జాతీయ పత్రికలే గొప్పదనాన్ని కీర్తిస్తూ వ్యాసాలు రాశాయని గుర్తుచేశారు.

సమర్థవంతమైన నాయకుడి నేతృత్వంలో దేశం ఎలా ఉంటుందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని తెలిపారు. 370 ఆర్టికల్ రద్దు.. ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండొద్దని అగ్రనేతలు శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, వాజ్‌పేయి సంకల్పిస్తే.. దాన్ని మోదీ పూర్తిచేశారన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ పార్టీ ఖూనీ చేసిందని విమర్శించారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా కాంగ్రెస్ అడ్డుకుంటే.. ఆ మహానీయున్ని బీజేపీ గౌరవించుకుందన్నారు. 

రోగులకు పండ్లు పంపిణీ 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ ౨౫:  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాచిగూడతోపాటు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో రోగులను పరామర్శించి పండ్లు పంపిణీ చేశారు. 

అబద్ధాల్లో కాంగ్రెస్‌కు ఆస్కార్: కేంద్ర మంత్రి బండి సంజయ్

ఆనాడు అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ పార్టీ నేడు ఆయనపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అబద్ధాల ప్రచారంలో కాంగ్రెస్ గోబెల్స్‌ను మించిపోయిందని, ఇందులో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సి వస్తే అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

1954 నుంచి 1988 వరకు నెహ్రూ, ఇందిరా, కామరాజ్ సహా 21 మందికి భారతరత్న అవార్డును ప్రకటించగా.. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌కు మాత్రం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన నేత వాజ్‌పేయి దేశ ప్రజలకు స్ఫూర్తి ప్రదాత అని అభివర్ణించారు.

ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని తెలిపారు. అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలకు 70 ఎంఎం సినిమాలు, గ్రాఫిక్స్ చూపుతూ మోసం చేస్తున్నాయి తప్ప హామీలను అమలు చేయడం లేదన్నారు. అంబేద్కర్‌ను రెండుసార్లు లోక్ సభ ఎన్నికల్లో ఓడించేందుకు స్వయంగా నెహ్రూ ప్రచారం చేశారని గుర్తుచేశారు.