22-02-2025 01:12:51 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): తెలంగాణ దాచిపెట్టుకున్న కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకెళ్తున్నా రాష్ర్ట ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడారు. తమ నాయకుడు హరీష్ రావు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉత్తి మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు.
రాష్ట్రానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మేం మాట్లాడితే, కాంగ్రెస్ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ర్టంలో, తెలంగాణలోనూ అన్యాయం చేసింది కాంగ్రెస్, బీజేపీలే అన్నారు. తెలంగాణకు సరైన నీటి వాటా దక్కక పోవడానికి కారణం చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీలే అని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ ఎవరో రాసిచ్చింది చదుతున్నారని జగదీష్ రెడ్డి అన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలన లో సాగు, తాగు నీళ్లకు ఎలాంటి కష్టం వాటిల్లలేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాల్సింది కేంద్రం మీద.. పక్క రాష్ర్టం సీఎం చంద్రబాబు మీద అని చెప్పారు. జగన్ సీఎంగా రాష్ట్రానికి వస్తే గౌరవించుకోవద్దా ?.. మీరు చంద్రబాబు దగ్గరికి క్యూ కట్టలేదా? అని కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. ఏపీలో ప్రాజెక్టుల మీద జగన్, చంద్రబాబు ఒకే వైఖరి మీద ఉన్నారని తెలిపారు.