calender_icon.png 28 December, 2024 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు కాంగ్రెస్సే శ్రీరామ రక్ష

02-12-2024 02:11:22 AM

  1. తప్పులు ప్రచారాలు చేయొద్దు
  2. పదేళ్ల బీఆర్‌ఎస్, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా? 
  3. గులాబీ నేతలకు మంత్రి జూపల్లి సవాల్ 

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ప్రజలకు కాంగ్రెస్ పార్టీయే శ్రీరామరక్ష అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన.. కాంగ్రెస్ ఏడాది పాలనపై చర్చించడానికి  హరీశ్‌రావు లేక కేటీఆర్ ఎవరు వస్తారో చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు.

దేశంలో ఏకకాలంలో రూ.21 వేలకోట్లు రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రుణమాఫీ, సన్నధాన్యానికి రూ.500 బోనస్ చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు.  గాంధీభవన్‌లో ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి , యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

గడిచిన పదేళ్లు బీఆర్‌ఎస్ గొప్ప పాలన చేస్తే.. తెలంగాణ అప్పుల కుప్పగా ఎందుకైందో చెప్పాలన్నారు. ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతుబంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  రైతుబంధు ఇవ్వాలంటే రూ.7 వేలకోట్లే అవసరమని.. గత ప్రభుత్వం అప్పులు చేయకుంటే నెలకోసారైనా రైతుబంధు ఇవ్వొచ్చని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల సొమ్మును బీఆర్‌ఎస్ పెద్దలు దోచుకోవడంతో పాటు తమ వారికి దోచిపెట్టారని ఆరోపించారు. అక్షయపాత్ర లాంటి రింగ్‌రోడ్డును రూ.7 వేల కోట్లకు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి ఏటా రూ.20 వేలకోట్లు చెల్లిస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయమన్నారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత 70 ఏళ్లకు పాలమూరు జిల్లా వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి దక్కిందని గుర్తు చేశారు.

రాష్ట్రాన్ని విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ, సాగునీటి రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని, అందులో భాగంగానే నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. రైతు పండుగ విజయవంతం కావడంతో బీఆర్‌ఎస్ నాయకులకు నిద్రపట్టడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు వెచ్చించిన అప్పటీ సీఎం కేసీఆర్.. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.

రాష్ట్రం బాగుపడటం బీఆర్‌ఎస్ నేతలకు ఇష్టం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విమర్శించారు. అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునేందుకే తెలంగాణలోకి పరిశ్రమలను రానివ్వటం లేదని మండిపడ్డారు. ఇకనైనా బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.