30-03-2025 12:15:31 AM
హిందీ తప్పనిసరి అని ఒత్తిడి చేశామా?
కస్తూరి రంగన్ సూచనల మేరకే కొత్త విద్యా విధానం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): దేశంలో త్రిభాషా విధానం కాంగ్రెస్ నేతృత్వంలోనే రూపుదిద్దుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన టీవీ 9 కాంక్లేవ్‌లో ఆయన ప్రసంగించారు. హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని ఒత్తిడి చేశామా అని ప్రశ్నించారు. తమిళనాడుకు చెందిన కస్తూరి రంగన్ సూచనల మేరకే 2022లో కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానం తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు. అయితే ఇన్నేళ్ల తర్వాత స్టాలిన్‌కు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ గుర్తుకురావడం విడ్డూరమన్నారు.
అవినీతి, లిక్కర్ స్కామ్ నుంచి తమిళనాడు ప్రజలను పక్కదారి పట్టించేందుకు సీఎం స్టాలిన్ కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. ఉన్నత పాఠశాల విద్య వరకు మాతృభాషలోనే చదువుకోవాలని కొత్త విద్యా విధానం చెబుతోందన్నారు. తమిళనాడు నుంచి ఆలిండియా సర్వీసుకు ఎంపికైతే ఉత్తరప్రదేశ్‌లో పనిచేయాల్సి వస్తే ఎలా అని ప్రశ్నించారు. హిందీ నేర్చుకుంటే ఉత్తరాదిలో పనిచేయడం సులభమన్నారు. వ్యాపారాలు చేసుకునేందుకు హిందీ అవసరం కానీ రాజకీయాలకు హిందీ వద్దనడం సరికాదని హితవు పలికారు. కేవలం రాజకీయాల కోసమే డీఎంకే నేతలు, కాంగ్రెస్ నాయకులు ఈ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ, కర్ణాటకలో ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.
హైదరాబాద్ నుంచే 60 శాతం
తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే 60 శాతం ఆదాయం వస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటప్పుడు హైదరాబాద్‌ను వదిలి ఆదిలాబాద్‌లో ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో చెప్పాలన్నారు. దేశంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందిని, దేశాభివృద్ధి కోసం వివిధ ప్రాంతాల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు.