రూ.2 లక్షల లోపు రుణమాఫీ పూర్తి
రుణమాఫీ కాలేదన్న మీ వ్యాఖ్యలు బాధించాయి
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణలో రైతు రుణమాఫీ అమలు కాలేదని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ విఫలమైందంటూ శనివారం రోజు మహారాష్ట్రలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.
ఈ మేరకు ఆయన ఆదివారం ప్రధాని మోదీకి లేఖ రాయడంతో పాటు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రైతులు తమ హామీలను గోల్డెన్ గ్యారెంటీలుగా విశ్వసిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో రూ.2 లక్షల లోపు రైతు రుణాలన్నింటినీ మాఫీ చేసినట్లు వెల్లడించారు. 22,33,067 మంది రైతులకు రూ.17,869.22 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదే అతిపెద్ద రుణ మాఫీఅని అన్నారు. రైతుల సంక్షేమం పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నామన్న సీఎం.. ఇతర రాష్ట్రాలకు ఈ విషయంలో ఆదర్శంగా ఉంటామని అన్నారు. రైతుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం, మార్గదర్శకత్వం ఉండాలని ప్రధాని మోదీని కోరారు.