calender_icon.png 28 September, 2024 | 4:46 AM

కాంగ్రెస్‌తోనే అవినీతికి పునాది

26-09-2024 02:37:03 AM

ప్రధాని నరేంద్రమోదీ

చండీగఢ్, సెప్టెంబర్ 25: కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే దేశం లో ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి పురుడుపోసుకుందని ప్రధాని నరేంద్రమోదీ దుయ్యబట్టారు. హర్యానాలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో బంధుప్రీతి స్పష్టంగా కనిపిస్తోందని వాపోయారు.

ఆ పార్టీ హర్యా నాను వారి వారసులకు, మధ్యవర్తులకు అప్పగించిందని మండిపడ్డారు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలో వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో దేశం అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. పారిశ్రామిక వృద్ధితోనే దళితులు, వెనుకబడిన వర్గాల సాధికారత ముడిపడిందన్న విషయాన్ని అంబేడ్కర్ పేర్కొన్నారని తెలిపారు.

కాగా కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఏన్డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రభుత్వం వద్దకు వెళ్తే.. ప్రభుత్వ పెద్దలు రైతులపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించారని మండిపడ్డారు. 2021లో వ్యవసాయ సాగుచట్టాలు రద్దు చేసిన తర్వాత కేంద్రం రైతులకు ఇచ్చిన హామీ లు ఏమయ్యాయని జైరాం ప్రశ్నించారు. మోదీ సర్కార్‌పై రైతులకు నమ్మకం లేదని పేర్కొన్నారు. హర్యానా శాసనసభకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి.