calender_icon.png 10 October, 2024 | 4:51 AM

కాంగ్రెస్ విషాన్ని చిమ్ముతోంది

10-10-2024 02:35:49 AM

హిందువులను విభజించాలని చూస్తోంది

హర్యానా ఫలితాలు కాంగ్రెస్ కుట్రలకు గుణపాఠం

మహారాష్ట్రలో అంతకన్నా పెద్ద విజయం సాధించాలి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: హర్యానాలో విజయం తర్వాత కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను బాధ్యతారాహిత్యమైన పార్టీగా అభివర్ణించారు. విభజన విషాన్ని చిమ్ముతూ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. మైనారిటీల ఓట్లు పొందేందుకు ముస్లింలలో భయాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు.

సమాజంలో విషబీజాలు నాటుతూ హిందువులను విభజించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో బుధవారం పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ కుట్రలన్నీ విఫలమయ్యాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఇంతకన్నా పెద్ద విజయం సాధించాల్సిన అవసరం ఉందని, ఇక్కడా కాంగ్రెస్‌కు గట్టి బదులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. 

మహారాష్ట్రలోనూ రిపీట్ కావాలి

హర్యానా ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం దేశ ప్రజలను ఆలోచనను తెలియజేస్తోంది. రాష్ట్రంలోని ఆదివాసీలు, ఓబీసీలు, దళితులు బీజేపీకి అండగా నిలిచారు. తమ రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కొన్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని దళిత లు గుర్తించారు.

రైతులనూ కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది. కానీ, ఎవరు పంటలకు కనీస మద్దతు ధర కల్పించారో హర్యానా రైతులకు తెలుసు కాబట్టే బీజేపీని గెలిపించారు. కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెప్పారు. మ హారాష్ట్రలోనూ అభివృద్ధి కొనసాగాలంటే బీజేపీ, మహాయుతి కూటమికి ఓటు వేయాలి. హర్యానా ఫలితాలు ఇక్కడ రావాలి అని మోదీ కోరారు.

 ప్రాజెక్టులకు అంకురార్పణ

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా రూ.7,600 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. నాగ్‌పూర్‌లోని అంబేడ్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులు, షిర్డీ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనానికి పునాది రాయి వేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ముంబై (ఐఐఎస్), విద్యా సమీక్ష కేంద్రంతో మహారాష్ట్రలో 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించారు.