ధరణితో లక్షలాది ఎకరాల భూమి మాయం
దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలి
బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్, జులై 30 (విజయక్రాంతి): రైతు రుణమాఫీ విషయంలో బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. రుణమాఫీకి రూ.30 వేల కోట్లు అవసరమని చెప్పిన ప్రభుత్వం.. బడ్జెట్‌లో ఆ మేరకు ఎందుకు నిధులు కేటాయించలేదని నిలదీశారు. మంగళవారం శాసనసభలో పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉన్నారని, కానీ బడ్జెట్ చూస్తే రుణమాఫీపై కోత విధిం చినట్టుగా తెలుస్తోందని చెప్పారు.
ధరణి పోర్టల్‌లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణను సీబీఐకి అప్పగించాలని, 24 గంటల్లో సీబీఐ ఆమోదం తీసుకొచ్చే బాధ్యత తమదని సవాల్ విసిరారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి ఉండేదని, ఇప్పుడు 5 లక్షలకు పడిపోయిందని ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడ్డారని, వీటిపైన సీబీఐ విచారణకు సిద్ధమా? అని సవాల్ చేశారు. ధరణిపోర్టల్ విదేశీ కంపెనీ ఆదీనంలో ఉందని, విదేశీ కంపెనీకి అప్పగించేందుకు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు.