- బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులివ్వకపోవడం దుర్మార్గం
- కేంద్రం కూడా అలానే చేస్తే ఏమవుతుందో ఆలోచించండి
- సింగరేణి ప్రైవేటీకరణపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దుష్ప్రచారం
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజం
కరీంనగర్, జూన్ 30 (విజయక్రాంతి): పార్టీల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణ దుష్ప్రచారం సహా అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ బాటలోనే నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ నిధుల కేటాయింపు, అసెంబ్లీ నియోకవర్గాల అభివృద్ధి విషయంలో బీజేపీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించాలని సచించారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు తమ వద్దకు వస్తే పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు తేడా లేదని, రెండు పార్టీలు ఫిరాయింపులకు పాల్పడుతున్నాయని, గతంలో బీఆర్‌ఎస్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని, ఇది సిగ్గుచేటన్నారు. సింగరేణి ప్రైవేటీకరణపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు.
కమీషన్లు తీసుకుంటే ఖబర్దార్
కొంతమంది దళారులు పీఎం విశ్వకర్మ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలకు వెనుకాడ బోమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం దరఖాస్తుదారుల్లో కొందరు మహిళలు బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామంటూ కొంతమంది దళారులు కమీషన్లు దండుకుంటున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు.లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకుగల కారణాలను దరఖాస్తుదారులకు అర్థమయ్యేలా వివరించే బాధ్యత కూడా అధికారులదేనని తెలిపారు. ఉందన్నారు.
బండి సంజయ్ పాట పాడితే..
హుస్నాబాద్, జూన్ 30 : బండి సంజయ్ మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన గొంతెత్తితే ప్రత్యర్థుల నోళ్లకు తాళం పడాల్సిందే. ఇప్పటివరకు ఆయన వాగ్ధాటినే చూశాం. కానీ, ఆదివారం ఆయన గంభీరమైన గొంతు గానం అందుకుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని సరస్వతి శిశుమందిర్ హైస్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పాటపడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ‘ఈ భూమి బిడ్డలం హిందువులమందరం.. కష్ట సుఖలలో కలిసిమెలిసి ఉంటుంటే.. బతుకు సుఖమయ్యేనురా.. బంగారు కలలన్నీ పండేనురా...’ అంటూ పాడిన పాటకు అందరూ చప్పట్లతో హోరెత్తించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే భరత నాట్యం బంద్ అయ్యిందని, కూచిపూడీ అడ్రస్ లేకుండా పోయిందని, బ్రేక్, షేక్ డ్యాన్సులే హల్‌చల్ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శిశు మందిరాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను శిశు మందిర్‌లో చదివానని, చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిశు మందిర్ విద్యాపీఠం దక్షిణ క్షేత్ర ప్రాంతం కార్యదర్శి సుధాకర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్‌పర్సన్ అనిత శ్రీనివాస్ రెడ్డి, విశు మందిర్ నిర్వహకులు కొత్తపల్లి అశోక్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.