calender_icon.png 30 October, 2024 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఆకర్ష్

06-07-2024 01:22:37 AM

  1. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్న హస్తం పార్టీ 

త్వరలోనే మరో ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు కార్యాచరణ

హైదరాబాద్, జులై ౫ (విజయక్రాంతి): తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి చేరి కలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్సీ హస్తం గూటికి చేరుతారో ఊహించలేని పరిస్థితి నెలకొన్నది. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారు కూడా.. హస్తం పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఒక వైపు ఎమ్మెల్యేలపై ఆప రేషన్ ఆకర్ష్‌ను చేస్తూనే.. మరో వైపు శాసనమండలి హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. 

చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్‌ను కాంగ్రెస్ వైపు తిప్పుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. అందుకు బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్.. తాజాగా  మరో ఆరుగురు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాసు మున్షీ గురువారం అర్ధరాత్రి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలను పార్టీలో  చేర్చుకుని.. బీఆర్‌ఎస్‌కు సవా ల్ విసిరినట్లుగానే ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల చేరికతో శాసన మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరుకున్నది. గవర్నర్ కోటాకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోదండరామ్, అమీర్‌ఖాన్ అభ్యర్థిత్వాలపై కోర్టు నుంచి క్లియరెన్స్ వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్సీల సంఖ్య 14కు చేరుకుంటుంది. వామపక్షాల పార్టీకి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌కే మద్దతుగా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా మరో ఆరుగురిని చేర్చుకుని మండలిలో మెజార్టీ సాధించుకునేందుకు  సీఎం రేవంత్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లుతున్నారు. ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల సంఖ్య 25 నుంచి 17కు పడిపోయింది.  ఎంఐఎంకు బీజేపీ  స్వతంత్రులు  గవర్నర్ నామినేటెడ్  4 ఉండగా, మరో రెండు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్నాయి. 

మండలిలో మొత్తం సభ్యులు 40 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. వీరిలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీలు 25 మంది ఉండగా, అధికార కాంగ్రెస్‌కు నలుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో మండలిలో బీఆర్‌ఎస్ పార్టీదే ఆధిపత్యం అని చెప్పొచ్చు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను శాసన మండలిలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడానికి అవకాశం ఉంటుందని బీఆర్‌ఎస్ ధీమాను ప్రదర్శించింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం బీఆర్‌ఎస్ సభ్యుడే కావడం తమకు కలిసి వస్తుందని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ భావించింది.

ఈ క్రమంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినెట్ అయిన ప్రొఫెసర్ కోదండరామ్, ఆమీర్‌ఖాన్ ప్రమాణస్వీకారం ఆలస్యం కావడం.. అనంతరం కోర్టు స్టే ఇవ్వడంతో ఆగిపోయింది. శాసన మండలి చైర్మన్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించి  కావాలనే వీరి ప్రమాణస్వీకారాన్ని ఆలస్యం చేశారన్న చర్చ కూడా ఆ సమయంలోనే జరిగింది. ఈ పరిణామాలతో సీఎం రేవంత్‌రెడ్డి అలర్ట్ అయ్యారు. బీఆర్‌ఎస్ నుంచి ఎంపీ టికెట్ ఆశించిన భంగపడ్డ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేలా వ్యూహాలు రచించారు. ఇందుకు కోసం గుత్తా అంటే గిట్టని ఉమ్మడి నల్లగొండ  జిల్లా కాంగ్రెస్ నేతలను సీఎం ఒప్పించారు.

ఈ క్రమంలో అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోయారు. సుఖేందర్‌రెడ్డి సైతం పార్లమెంట్ ఎన్నికల సమయంలో పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో వచ్చే శాసనమండలి సమావేశాల్లో సుఖేందర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్‌ఎస్ ప్లాన్ చేసింది. తమకు ఉన్న బలంతో సుఖేందర్‌రెడ్డిని చైర్మన్ పీఠం నుంచి దించాలని బీఆర్‌ఎస్ భావించింది. ఇది గమనించిన  అధికార కాంగ్రెస్ పార్టీ  బీఆర్‌ఎస్ ఎత్తులకు పై ఎత్తులు వేయడం ప్రారంభించి.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేసింది. ఈ క్రమంలో ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకోవడంతో పాటు.. మరో ఆరుగురిని త్వరలోనే చేర్చుకునేందుకు రెడీగా ఉన్నారు. 

ప్రతీకారం తీర్చుకుంటున్న కాంగ్రెస్

రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ కూడా.. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను కూడా చేర్చుకున్నారు. మండలిలో చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు.  బీఆర్‌ఎస్ రెండోసారి అధకారంలోకి వచ్చాక శాసన సభలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు అప్పటి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పారు. దీంతో శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. అంతకు ముందు శాసన మండలిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఇప్పుడు  కాంగ్రెస్ పార్టీకి కూడా బీఆర్‌ఎస్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.   

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు..

1. టీ జీవన్‌రెడ్డి 2. మహేష్‌కుమార్‌గౌడ్

3. బల్మూరు వెంకట్ 4. తీన్మార్ మల్లన్న

గతంలో బీఆర్‌ఎస్ నుంచి చేరిన వారు.. 

5. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి

6. పట్నం మహేందర్‌రెడ్డి.

తాజాగా చేరిన వారు.. 

7. బస్వరాజు సారయ్య 8. భానుప్రసాద్

9. ఎంఎస్ ప్రభాకర్ 10. దండె విఠల్

11. దయానంద్ 12. యెగ్గె మల్లేశం

నేడు హస్తం గూటికి బండ్ల

త్వరలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు!

బండ్ల చేరికను వ్యతిరేకిస్తున్న మాజీ జెడ్పీ చైరపర్సన్ సరిత

హైదరాబాద్/గద్వాల (వనపర్తి), జులై 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారని సమాచారం. కాంగ్రెస్ కండువా కప్పుకునే వారిలో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు, హెచ్‌ఎండీఏ పరిధిలో ఇద్దరు, దక్షిణ తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు చేరేవారిలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహారించేవారు ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి లైన్‌క్లియర్ అయింది. వీలైతే శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం.

ఇప్పటికే ఆయన తన నియోజకవర్గంలో క్యాడర్‌తో సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీ మారే విషయం చర్చించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లాలని సూచించారని, తామందరం వస్తామని కూడా ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారని చెబుతున్నారు. అయితే కృష్ణమోహన్‌రెడ్డి చేరికను గద్వాల తాజా మాజీ జడ్పీ చైర్మన్ సరితాతిరుపతయ్య యాదవ్ వ్యతిరేకిస్తున్నారు. ఆమె అనుచరులు గాంధీభవన్‌లో ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సరిత, బీఆర్‌ఎస్ నుంచి కృష్ణమోహన్‌రెడ్డి పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో సరిత ఓటమి చెందారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తన రాజకీయ పరిస్థితిపై వివరించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు.    

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలు వీరే..

ఎంఎస్ ప్రభాకర్‌రావు: తన రాజకీయ ప్రస్థా నం కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించారు. ఆయన కాంగ్రెస్‌లో  వివిధ హోదాల్లో పనిచేశారు. ఉమ్మడి ఏపీ శాసనమండలికి 2010 ఎన్నికల్లో  హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి కాంగ్రెస్ తరుఫున ఎమ్మెల్సీగా గెలిచా డు. ఆయన ఈ పదవిలో 2010 నుండి 2013 వరకు ఉన్నారు. మళ్లీ  2014 నుండి 2019 వరకు రెండవసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2019లో టీఆర్‌ఎస్ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2024 జూలై 5న తిరిగి సొంతగూటికి చేరారు.

బస్వరాజు సారయ్య: వరంగల్  మున్సిపాలిటీలో మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేశారు. 1999 శానససభ ఎన్నికల్లో  కాంగ్రెస్ తరుఫున వరంగల్ నుంచి గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీ అడుగుపెట్టారు. 2004 ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గుండు సుధారాణిపై 41,167 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రజారాజ్యం అభ్యర్థి ప్రదీప్‌రావుపై 7255 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2010 నుండి 2014 వరకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో వెనకబడిన కులాల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓటమి చెందారు. 2016లో టీఆర్‌ఎస్ చేరి 2017లో ప్రధాన కార్యదర్శిగా నియమితులైయ్యారు. 2020 నవంబర్ 18న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. 

భానుప్రసాద్: కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2008లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కరీంనగర్ స్ధానిక సంస్థల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఉమ్మడి ఏపీలో శాసనమండలిలో రాజీవ్ రహదారిపై వేసిన హౌస్ కమిటీ చైర్మన్‌గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, మైనార్టీ సంక్షేమ సంఘం సభ్యుడిగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాన ఏర్పడిన తరువాత 2016లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2016లో జరిగిన మండలి ఎన్నికల్లో కరీంనగర్ స్థానిక సంస్థల నుంచి పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పనిచేశారు. 2017లో టీఆర్‌ఎస్ కార్యదర్శిగా నియమితుడయ్యారు. 2021లో జరిగిన జరిగిన కరీంనగర్ స్థానిక సంస్థల నుంచి పోటీ చేసి మూడోసారి ఎన్నికయ్యాడు.  తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో సొంతగూటికి చేరారు.

దండె విఠల్: టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి పార్టీ కార్యక్రమాల్లో,  స్వరాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. 2009 నుంచి 2013 వరకు సనత్‌నగర్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా పనిచేసిన ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై ఓడిపోయారు. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం సమన్వయ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యారు. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్ధానిక సంస్థల నుంచి పోటీ చేసి గెలుపొందారు. 

దయానంద్: 2003లో టీడీపీలో చేరి 2009 నుంచి 2014 వరకు గోషామహల్ నియోజకవర్గ టీడీపీ వాణిజ్య సెల్  కమిటీ సభ్యులుగా పనిచేశారు.  2014 లో టీఆర్‌ఎస్‌లో చేరి 2020 నవంబర్ 15న గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2024లో పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం ఇన్‌చార్జిగా పనిచేశారు.

యెగ్గె మల్లేశం:  1981లో నాగోల్ గ్రామపంచాయతీ మెంబర్‌గా పనిచేశాడు. తరువాత టీడీపీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2010 హైదరాబాద్ స్దానిక సంస్థల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2016లో టీఆర్‌ఎస్‌లో చేరి వివిధ పదవులు చేపట్టారు. 2019లో టీఆర్‌ఎస్ తరఫున శాసనసభ్యుల ఎమ్మెల్సీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. 2024లో మల్కాజిగిరి లోక్‌సభలో ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా పనిచేశారు.