బీజేపీ వస్తే రాజ్యాంగం మారుస్తారనేది అబద్ధం
సామాజిక న్యాయం కమల దళంతోనే సాధ్యం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలు నమ్మవద్దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. తాను ఉండగా రాజ్యాంగం మార్పు ఉండదని, రాజ్యంగం వల్లే ప్రధానమంత్రి స్థాయికి వచ్చినట్లు నరేంద్రమోదీనే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.
మోదీ 2024లోనే కాదు 2029లోనూ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మేధావులు, ప్రజలు, విద్యార్థులు కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేద ప్రజల ఓట్లు దండుకోవడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు ఎస్సీ రిజర్వుడు, కంటోన్మెంట్ అసెంబ్లీ సీట్లలో మాదిగలకు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో మాదిగ సమాజం ఆగ్రహంతో ఉందన్నారు. రిజర్వుడు స్థానాలు పోను మిగతా 12 జనరల్ స్థానాల్లో బీసీలకు కేవలం రెండే ఇచ్చి, రెడ్డి సామాజిక వర్గానికి 8 టికెట్లు ఇవ్వడంతో బీసీలు కూడా కోపంగా ఉన్నారన్నారు.
చేవెళ్ల డిక్లరేషన్ సంగతేంటి?
వీరి మద్దతు కోల్పోయిన కారణంగానే కొంత మంది మాల వర్గానికి చెందిన విశ్రాంత ఐఏఎస్, ఇతర ఉద్యోగులను మేధావుల పేరుతో రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేయిస్తోందని మందకృష్ణ దుయ్యబట్టారు. ఖర్గేకు వయసు మీదపడి మతిపోయి మాట్లాడుతున్నారన్నారు. చేవెళ్ల డిక్లరేషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామన్న హామీ ఏమైందని? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల పెంపునకు ఎవరు అడ్డం పడ్డారు? రిజర్వేషన్లు గురించి మాట్లాడే ఖర్గే కర్ణాటకలో ఎందుకు పెంచడం లేదు? కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే రిజర్వేషన్లు పెంచారు.
ఇక్కడ ఎన్టీఆర్ హయాంలో 14 శాతం ఉన్న ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతానికి, ఎస్టీలకు 4 నుంచి 6 శాతానికి పెంచారని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకు ఉందన్న విషయం తెలియదా? అని నిలదీశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడితే దొరలు, రెడ్లకు మాత్రమే అశాంతి ఉంటుందని రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో బీసీలు సీఎం అయ్యే అవకాశమే ఉండదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు, ఎస్సీల్లోని మాదిగ, ఉప కులాలకు న్యాయం జరుగుతుందన్నారు.
రేవంత్‌రెడ్డి ఒక పిట్టల దొర..
రేవంత్‌రెడ్డి పిట్టల దొర అని మందకృష్ణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం చేస్తున్నామని, ఎన్నో పార్టీలను నమ్మి ఎన్నికల్లో మద్దతు ఇచ్చామ ని గుర్తుచేశారు. కానీ మా కండువా మారలేదన్నారు. 2018 అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన పార్లమెంట ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చామని, మల్కాజిగిరిలో రేవంత్‌రెడ్డికి ప్రచారం చేశామ న్నారు. ఇప్పుడు కోసం బీజేపీకి మద్దతు ఇస్తునట్లు తెలిపారు.
తనను బీజేపీ నాయకుడని రేవంత్‌రెడ్డి అంటున్నారని, తనకు ఆ పార్టీలో సభ్యత్వం లేదనే విష యం తెలుసుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డి పార్టీలు మారినట్లు తాను ఏ కండువా కప్పుకోలేదన్నారు. దేశం భద్రంగా ఉండాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా మోదీతోనే సాధ్యమన్నారు. దేశం అభివృద్ది చెందాలని కోరుకునే వారు కులాలు, మతాలకు అతీతంగా బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.