calender_icon.png 6 November, 2024 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్

30-06-2024 01:34:40 AM

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని బీసీ జనసభ, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షులు రాజారాంయాదవ్ విమర్శించారు. శనివారం నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న ఓయూ విద్యార్థినేత మోతీలాల్‌నాయక్‌కు మద్దతుగా బీసీ జనసభ, గిరిజన రిజర్వేషన్ సాధన సమితి, ఓయూ జేఏసీ నాయకులతో అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి పోలీసులు తరలించారు. అనంతరం రాజారాంయాదవ్ మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి నిరుద్యోగుల కోసం గాంధీలో ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న మోతీలాల్‌కు ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ గిరిజన విద్యార్థి ఆరోగ్యంపై సీఎం రేవంత్‌రెడ్డికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. అధికారంలోకి రాకముందు రాహుల్‌గాంధీని అశోక్‌నగర్ చౌరస్తాలో టీ తాగించి డ్రామాలాడించి, నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి ద్వారా అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ మోసపూరిత వాగ్దానాలను దేశస్థాయిలో ఎండగడుతామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని మాట తప్పడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మేకల కృష్ణయాదవ్, డాక్టర్ శెట్టి హరికృష్ణ, బీసీ సభ రాష్ట్ర నాయకులు లోడంగి గోవర్ధన్, ఎంపీటీసీల ఫోర రాష్ట్ర అధ్యక్షులు కరుణకర్ ముదిరాజ్  తదితరులు పాల్గొన్నారు.