కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
నేటి సభను విజయవంతం చేయాలని పిలుపు
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ప్రజలను నిట్టనిలువునా ముంచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. గారడీ గ్యారెంటీలను, గాయబ్ అయిన హామీలను, గాడితప్పిన పాలనను బీజేపీ ప్రశ్నిస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై శనివారం బీజేపీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
నీడను కూలుస్తూ, నీచ రాజకీయాలు చేస్తూ, నియంత పాలన కొనసాగిస్తున్న నీతిలేని నాయకులను, నిజాం వారసుల దోస్తులను తెలంగాణ ప్రశ్నిస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. సరూర్‌నగర్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని బండి పేర్కొన్నారు. సభకు భారీగా ప్రజలు హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన మోసాలను, వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు ఇచ్చిన హమీలను అమలు చేసేలా ఒత్తిడి తేవడంలో భాగంగా బీజేపీ ఈ సభను నిర్వహిస్తున్నదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు హాజరై సంఘీభావం తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.