19-04-2025 05:47:29 PM
పండించిన ధాన్యాన్ని కొనేందుకు కొర్రీలు...
బీజేపీ నాయకులు..
హాజీపూర్/మంచిర్యాల (విజయక్రాంతి): రైతుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా దోచుకుంటుందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్(Nagunuri Venkateswar Goud) అన్నారు. శనివారం హాజీపూర్ మండలం పడ్తన్ పల్లి, కర్ణమామిడి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులతో కలిసి సందర్శించి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, సెంటర్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎలాంటి తాలు, తప్ప లేకున్నా ధాన్యం కొనుగోలు చేయకుండా తూర్పార పట్టిస్తున్నారని, దాని వాళ్ల రైతుల వద్ద అధిక భారం పడుతుందన్నారు. అదే విధంగా కొనుగోలు సమయంలో ప్రతి 40 కేజీల ధాన్యం బస్తాపై అదనంగా 1.30 కేజీలు కాంట పెట్టి రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రసీదు కూడా ఇవ్వడం లేదన్నారు.
15 రోజులైనా కొనుగోలు చేయడం లేదు
బిజెపి సీనియర్ నాయకులు రఘునాథ్ మాట్లాడుతూ... రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు దాటినా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యంలో ఎలాంటి తాలు, తప్ప లేకున్నా తూర్పార పేరుతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు.
ధాన్యం కొనుగోలు చేయడం ఆలస్యం కావడంతో అకాల వర్షాల వల్ల ఎక్కడ తమ వడ్లు తడుస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని, అదే విధంగా రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని, రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కటింగ్ పేరుతో దోచుకుంటుందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే ఎలాంటి షరతులు లేకుండా కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిజెపి నాయకులు కార్యక్రమంలో తమ్మిడి శ్రీనివాస్, పెద్దపల్లి పురుషోత్తం, మాథవరపు వెంకట రమణ రావు, ఎనగందుల కృష్ణ మూర్తి, బియ్యాల సతీష్ రావు, గడ్డం స్వామి రెడ్డి, బొలిశెట్టి అశ్విన్, మడిపెల్లి సత్యం, కొట్టే ప్రశాంత్, మారు వెంకట్ రెడ్డి, బొడ్డు తిరుపతి, జూపాక ధర్మయ్య, తదితరులు పాల్గొన్నారు.