- హస్తంపార్టీ హామీలను ప్రజలు నమ్మలేదు
- మహారాష్ట్రలో ఎన్డీయేది అద్భుత విజయం
- అసెంబ్లీ ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందన
న్యూఢిల్లీ, నవంబర్ 23: కాంగ్రెస్ తన ఆత్మహత్యలో మిత్రపక్షాలను భాగస్వాములుగా చేసుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడూ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి వక్ఫ్ బోర్డును సాధనంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
శనివారం రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఇతర పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో అద్భుత విజయంతో గత రికార్డులను తిరగరాశాం.
బీజేపీకి వరుసగా మూడు సార్లు ప్రజలు పట్టం కట్టారు. ఎన్డీయే అంటేనే గుడ్ గవర్నెన్స్. జార్ఖండ్‌లో మరింత కష్టపడాల్సింది. కానీ కాంగ్రెస్ కుల రాజకీయాలను ప్రోత్సహించింది. ఇండియా కూటమి ఇచ్చిన హామీలను మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ తాను మునిగిపోవడమే కాకుండా మిత్రపక్షాలను ముంచుతోంది.
రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రాజ్యాంగం పేరుతో అబద్ధాలు చెప్పి వెనుకబడిన వర్గాలను విభజించాలని కుట్ర చేశారు. వారి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. రాబోయే ఐదేళ్లలో మహారాష్ట్రను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాం అని మోదీ అన్నారు.
లౌకిక విలువలను ధ్వంసం చేశారు
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు వక్ఫ్ బోర్డు చక్కటి ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ మనకు అందించిన రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి స్థానం లేదు. కానీ కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు పెంచుకోవడానికి ఆ అంశంపై రాజకీయాలు చేసింది. 2014లో కాంగ్రెస్ పాలన ముగియకముందే ఆ పార్టీ ఢిల్లీ సమీపంలోని కొన్ని ఆస్తులను వక్ఫ్ బోర్డుకు అప్పగించింది.
అధికార దాహంతో కాంగ్రెస్ కుటుంబం రాజ్యాంగ లౌకిక విలువలను ధ్వంసం చేసింది అని మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా, వక్ఫ్ చట్టం-1995 సవరణ చేపట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు శీతకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు... గెలిచిన ప్రముఖులు
అభ్యర్థి నియోజకవర్గం పార్టీ మెజార్టీ
ఏక్‌నాథ్ షిండే కోప్రీ- పచ్‌పఖాడీ శివసేన 1,20,717
దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ బీజేపీ 39,710
అజిత్ పవార్ బారామతి ఎన్సీపీ 1,81,132
ఆదిత్యా ఉద్ధవ్ థాక్రే వర్లీ శివసేన (యూబీటీ) 8,801
నానా పటోలే సకోలీ కాంగ్రెస్ 208
చావన్ శ్రీజయ అశోక్‌రావు భోకార్ బీజేపీ 50,551
ముఖ్యమైన నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులు
నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ మెజార్టీ
థానే సంజయ్‌ముకుంద్ ఖేల్కర్ బీజేపీ 58,253
షిరిడీ పాటిల్ విఖే రాధాకృష్ణ బీజేపీ 70,282
షోలాపూర్ సెంట్రల్ దేవేంద్ర రాజేశ్ కోఠే బీజేపీ 48,850
పుణె కంటోన్మెంట్ కాంబ్లే సునిల్ ధ్యాన్‌దేవ్ బీజేపీ 10,320
నాసిక్ సెంట్రల్ దేవ్‌యాని సుహాస్ పరందే బీజేపీ 17,856
మలబార్ హిల్ మంగళ్ ప్రభాత్ లోధా బీజేపీ 68,019
గడ్చీరౌలీ డాక్టర్ మిళింద్ రామ్‌జీ బీజేపీ 15,505
కల్యాణ్ వెస్ట్ విశ్వనాథ్ అత్మారాం బోయిర్ శివసేన 42,454
కోల్హాపూర్ నార్త్ రాజేశ్ వినాయక్ క్షీర్‌సాగర్ శివసేన 29,563
అంధేరీ ఈస్ట్ ముర్జీ పటేల్ (కాక) శివసేన 25,486
ధారావి డాక్టర్ గైక్వాడ్ జ్యోతి ఏక్‌నాథ్ కాంగ్రెస్ 23,459