11-12-2024 12:51:36 AM
మంద కృష్ణమాదిగ ఆగ్రహం
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 10: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా మాదిగలకు రేవంత్‌రెడ్డి అన్యాయం చేశారని ఆరోపించారు.
ఇబ్రహీంపట్నంలోని చౌరస్తాలో మంగళవారం ఎమ్మార్పీఎస్ జేఏసీ అధ్యక్షుడు బోసుపల్లి ప్రతాప్‌మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామని.. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకునేందుకు అడుగుదూరంలో ఉన్నసమయంలో వర్గీకరణనను మాలలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆర్టికల్ 15, 16 ప్రకారం అందరికీ సమాన అవకాశాలు, ఉద్యోగాలు రావాలన్నారు. వర్గీకరణ అమలుకు మరోసారి ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ ఖాసీం మాట్లాడుతూ.. మాదిగలందరూ మందకృష్ణ గారి నాయక త్వాన్ని బలపర్చాలన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన అవకాశాలు ఉండాలన్నారు.
ఎస్సీ జాబితాలోని 59 కులాలు రిజర్వేషన్‌ను సమానంగా పంచుకుని సమాజంలో మందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రవీణ్, మంద సురేశ్, కృపేన్, కృష్ణ, దాసు, కృష్ణ, దర్శన్ తదితరులు పాల్గొన్నారు.