calender_icon.png 28 September, 2024 | 4:56 AM

కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది

28-09-2024 02:55:06 AM

  1. బీఆర్‌ఎస్ కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించింది
  2. 109వ జయంతి సభలో బీసీసంక్షేమ మంత్రి పొన్నం 
  3. హాజరైన మంత్రులు జూపల్లి, తుమ్మల, సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): రాహుల్ గాంధీ కోరిక మేరకు రాష్ట్రంలో కులగణన చేసి తీరుతామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో బడుగు బలహీనవర్గాలంతా  ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు..

శుక్రవారం రవీంద్ర భారతిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క హాజరయ్యారు. తొలుత మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..

కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్ర, ఆయన చాటిన స్ఫూర్తి భవిష్యత్ తరాలకు తెలియాలనే ఈ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. బాపూజీ మలిదశ తెలంగాణ ఉద్యమం కోసం తన ఇంటినే కార్యాలయంగా మార్చారన్నారు. తెలంగాణ ఏర్పడే వరకు ఎలాంటి పదవులు తీసుకోనని చెప్పిన గొప్ప వ్యక్తి బాపూజీ అని, అలాంటి వ్యక్తిని బీఆర్‌ఎస్ అవమానించిందన్నారు.

బాపూజీ అంతిమ సంస్కరాలకు కూడా గత ముఖ్యమంత్రి హాజరుకాకపోవడం సిగ్గుచేటన్నారు.  సింథటిక్ వస్త్రాలను బ్యాన్ చేసి చేనేత వస్త్రాలు వినియోగించాలని పిలుపునిచ్చారు.

మూడు తరాల ఉద్యమ నేత: మంత్రి జూపల్లి

కొండా లక్ష్మణ్ బాపూజీ మూడు తరాల ఉద్యమనేత అని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పట్టుదల, నిజాయితీ, పోరాటాలకు ఆయన మారుపేరని తెలిపారు. మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ర్ట సాధన కోసం రాజీనామా చేసిన మొదటి వ్యక్తి అని కొనియాడారు. ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చినప్పటికీ  తెలంగాణ సాధన కోసం త్యాగం చేశారన్నారు.

తాను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని వివరించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగలేదని చెప్పారు. గత ప్రభుత్వం భూములు తాకట్టు పెట్టి లక్షల కోట్ల అప్పుతెచ్చి వేల కోట్ల ధనాన్ని లూటీ చేసిందన్నారు.

పోరాట యోధుడు: మంత్రి తుమ్మల 

కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మంతా తెలంగాణ కోసం పోరాడిన యోధుడని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. ఆనాటి రాజకీయాల్లోనే బడుగు బలహీనవర్గాల కోసం పోరాడిన వ్యక్తి అన్నారు. చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ర్ట సాధన కోసం తపించారన్నారు. చేనేత వృత్తి మీద ఆధారపడిన వారిని ఆర్థికంగా ఉపాధి కల్పించేలా చూస్తున్నామన్నారు.

బాపూజీకి శాసనమండలి చైర్మన్ నివాళి

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శాసన మండలి చైైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, లేజిస్లేచర్ సెక్రెటరీ నరసింహాచార్యులు తదితరులు నివాళి అర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఉద్యమంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.

నిజమైన తెలంగాణ బాపూజీ : మంత్రి సీతక్క

నేతన్నలకు ఏ సమస్య వచ్చినా.. తనకు చెబితే సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి సీతక్క తెలిపారు. పదవులను తృణప్రాయంగా వదిలేసిన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కొనియాడారు. నిజమైన తెలంగాణ బాపూజీ.. కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. బడుగు బలహీనవర్గాల కోసం పోరాడిన మహనీయుడన్నారు. అణగారిన వర్గాల గొంతుక అయ్యారన్నారు.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనీల్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఓబీసీ జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి పాల్గొన్నారు.