* ప్రభుత్వ పథకాల్లో అన్నీ కోతలే
* బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాం తి): కాంగ్రెస్ కోతల పాలనతో ఎగవేతల ప్రభుత్వంగా మారడంతో సర్కారు పథకాలు ఖతమయ్యాయని, రైతులు నిండా మునుగుతున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. రుణమాఫీ, రైతుభరోసా, బోనస్.. అన్నింటా కోతలేనని ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
క్యాబినెట్ భేటీలో భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం చూస్తే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని తప్పినట్టుగా అర్థమవుతోందని పేర్కొన్నారు. మ్యానిఫెస్టో, డిక్లరేషన్‌లో చెప్పిన రూ.15 వేలకు కోతపెట్టినట్టేనా అని ప్రశ్నించా రు. కాంగ్రెస్ సర్కారు నిర్ణయం రైతుల ఆశలను అడియాసలు చేసిందని మండిపడ్డారు.
రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్‌లో రూ.7,500 చొప్పున ఇస్తామని చెప్పి రూ.6,000కు కుదించారని, ఇది కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనంగా అభివర్ణించారు. కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ నీటిమీద రాతలేనని మరోసారి రుజువైందని ధ్వజమెత్తారు. వరంగల్ డిక్లరేషన్ అబద్ధమని తేలిందని, రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రేవంత్‌రెడ్డి మాటలు బూటకమని రైతులకు అర్థమవుతున్నదని పేర్కొన్నారు.