calender_icon.png 16 January, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ స్వయంకృతం

10-10-2024 12:00:00 AM

లోక్‌సభ ఎన్నికలు జరిగిన నాలుగు నెలలకే జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలవడంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. పదేళ్ల బీజేపీ పాలన కారణంగా ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతతో రాష్ట్రంలో తమ గెలుపు సునాయాసమన్న అతి ధీమా ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని రాజకీయపరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ సారి రాష్ట్రంలో గెలుపు అంత సులభం కాదని గ్రహించిన భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా ఏడాది ముందునుంచే తన వ్యూహాలకు పదును పెడితే.. కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసంతో ఓటమిని కొని తెచ్చుకుంది. గెలుపుపై అతి ధీమాతో ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకత్వం చివరికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనను కూడా పెడచెవిన పెట్టి కనీసం ఆరు సీట్లు ఇచ్చినా పొత్తుకు సిద్ధపడిన ఇండియా కూటమి భాగస్వామి ఆమ్‌ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించడం ఆ పార్టీ చేసిన పెద్ద తప్పిదం.

దీంతో రాష్ట్రంలోని అన్ని స్థ్థానాల్లో ఒంటరిగా పోటీకి దిగిన ఆప్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా కాంగ్రెస్‌కు అధికారం చేజారేలా చేయగలిగింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆప్‌కు వచ్చింది 1.75 శాతం ఓట్లే కానీ, కాంగ్రెస్, బీజేపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం 0.85 శాతం మాత్రమే. జాట్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడాకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ చేసిన మరో ముఖ్యమైన తప్పు.

దీంతో దళిత నాయకురాలు, సిర్సా లోక్‌సభ సభ్యురాలు కుమారి సెల్జా పార్టీ విజయం కోసం పూర్తిస్థాయిలో పని చేయలేదు. అంతేకాకుండా జాటేతర వర్గాలయిన ఓబీసీలు, రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణ, పంజాబీ ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో కమలదళం విజయం సాధించింది. రాష్ట్ర జనాభాలో ఈ వర్గం ఓటర్లు 40 శాతం ఉండగా, జాట్ ఓటర్లు దాదాపు ౨౭ శాతం ఉన్నారు.

చివరికి జాట్‌ల్యాండ్‌లో సైతం కాంగ్రెస్ చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలవలేదు. ఆ పార్టీ 16 చోట్ల విజయం సాధిస్తే బీజేపీ కూడా 15 స్థానాల్లో గెలుపొందింది. అంటే జాట్‌లు కాంగ్రెస్ ఊహించినంతగా బీజేపీని వ్యతిరేకించలేదని స్పష్టమయింది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మొగ్గలేదు. 

ఆమ్‌ఆద్మీ పారీ,్ట ఐఎన్‌ఎల్‌డీ, బీఎస్‌పి, ఆజాద్ సమాజ్ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలతో పాటుగా స్వతంత్రులు, రెబల్స్ పెద్ద సంఖ్యలో బరిలో ఉండడంతో ఆ ఓట్లలో చీలిక వచ్చింది. మొత్తంమీద బీజేపీ కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కొంటే కాంగ్రెస్ గెలుపు గుర్రాలకు కాకుండా సొంత మనుషులకు టికెట్లు ఇచ్చి గెలిచే చోట ఓటమిని కొని తెచ్చుకుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

హర్యానా ఎన్నికల పలితాల ప్రభావం రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, ఢిల్లీ శాసన సభ ఎన్నికలపైనా పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర, బీహార్‌లలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, జార్ఖండ్‌లో మిత్రపక్షమైన జేఎంఎంతో కలిసి కాంగ్రెస్ అధికారంలో ఉంది.

హర్యానాలో తమతో పొత్తును నిరాకరించిన కాంగ్రెస్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ గుర్రుగానే ఉంది. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ ముఖ్యంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ తాజాగా ప్రకటించింది. అన్నిటికన్నా మించి మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం, శరద్ పవార్ ఎన్‌సీపీతో పాటుగా కాంగ్రెస్ ‘మహా వికాస్ అఘాడి’(ఎంవీఏ) పేరుతో కూటమిగా ఉన్నాయి.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ కూటమి రాష్ట్రంలో మెజారిటీ స్థానాలను గెలుచుకోవడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం విజయం సాధిస్తామన్న ధీమాతో ఉంది. హర్యానా ఫలితాల నేపథ్యంలో కూటమిలోని  ఉద్ధవ్ శివసేన, పవార్ పార్టీలు మెజారిటీ స్థానాల కోసం పట్టుబట్టే ప్రమాదం ఉంది. అందుకు కాంగ్రెస్ తలొగ్గాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని, మిత్రపక్షాల విషయంలో తన వ్యూహాలను మార్చుకోవలసిన అవసరం ఉందని శివసేన వ్యాఖ్యానించింది. అలాగే జార్ఖండ్‌లో మరో ప్రాంతీయ పార్టీ అయిన జేఎంఎం విషయంలోనూ అది రాజీ పడాల్సి వస్తుందనిపిస్తోంది.

మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వాములయిన సమాజ్‌వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌లాంటి ప్రాంతీయ పార్టీలు సైతం కాంగ్రెస్ తీరు పట్ల తమ అసహనాన్ని బయటపెట్టాయి. ఓవైపు హర్యానా ఓటమి భారంతో కుంగిపోయి ఉన్న కాంగ్రెస్ మరి ఈ ఒత్తిళ్లన్నిటినీ ఎదుర్కొని తన వ్యూహాలను మార్చుకుంటుందా, లేక ‘పెద్దన్న’ పోకడతో కూటమి ఉనికికే ఎసరు తెస్తుందో వేచి చూడాలి.