* ఆప్‌కు జైకొట్టిన ఇండియా కూటమి
* కాంగ్రెస్ ఒంటరి
* రసవత్తరంగా ఎన్నికల పోరు
* ఫిబ్రవరి 5న న్నికలు
న్యూఢిల్లీ, జనవరి 8: ఇండియా కూటమిని ముందుండి నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో ఏకాకిగా మిగిలింది. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ), సమాజ్ వాదీ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో ఉన్నా కూడా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు ఆప్ వైపే మొగ్గు చూపాయి.
రాబోయే ఎన్నికల్లో మద్దతు ప్రకటించినందుకు కేజ్రీవాల్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ‘థాంక్యూ దీదీ’ అని ఎక్స్‌లో ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా.. 8న ఫలితాలు వెలువడనున్నాయి. 2015, 2020లలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటింది.
పీఎం నివాసం దగ్గర ఆప్ హల్‌చల్
దేశరాజధాని బుధవారం పోటాపోటీ నిరసనలతో అట్టుడికిపోయింది. ఆప్, బీజేపీ నేతలు ఒకరికి వ్యతిరేఖంగా మరొకరు పోటాపోటీ నిరసనలు చేపట్టారు. ఆప్ నేతలు ప్రధాని ఇంటి సమీపంలో నిరసన చేయగా.. ప్రతిగా బీజేపీ నేతలు సీఎం అతిషీ బంగ్లా మందు బైఠాయించారు.
బీజేపీ నేతలు మాజీ సీఎం కేజ్రీవాల్ ఉపయోగించిన బంగ్లాను శీష్ మహల్ (అద్దాల మేడ) అంటూ ఆరోపణలు చేయగా.. దానికి కౌంటర్‌గా ఆప్ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్‌లు మీడియాను తీసుకుని ఆ బంగ్లా వద్దకు చేరుకున్నారు.
కానీ అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారు అక్కడే కూర్చుని ధర్నాకు దిగారు. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో 6 ఫ్లాగ్ రోడ్‌లోని సీఎం అధికారిక నివాసం మరమ్మతుల కోసం రూ. 40 కోట్లు ఖర్చు చేశాడని బీజేపీ ఆరోపిస్తోంది.
ఆ భవనాన్ని శీష్ మహల్ అని పిలుస్తోంది. దానికి కౌంటర్‌గా ఆప్ ప్రధాని మోదీ నివాసాన్ని ‘రాజ్‌మహల్’ అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. ప్రధాని నివాసాన్ని దాదాపు రూ. 2700 కోట్ల ఖర్చుతో నిర్మించారని ఆప్ చెబుతోంది. ‘ఈ నివాసంలోకి ఎవరినీ అనుమతించొద్దని పై నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకే మేము ఎవరినీ అనుమతించడం లేదు’ అని పోలీసులు పేర్కొన్నారు.
దీనిపై మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ ‘పోలీసుల చర్యతో బీజేపీ సంతోషంగా ఉండి ఉంటుంది’ అని అన్నారు. పోలీసుల తీరుపై ఎంపీ సంజయ్ సింగ్ కూడా అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ బిల్డింగ్ గురించి బీజేపీ ప్రతిరోజు తప్పుడు ఆరోపణలు చేస్తోంది. నిజాలను చూపిద్దామని మీడియాతో వస్తే పోలీసులు అనుమతించడం లేదు. అసలు ఎందుకు ఈ దారి మూసేశారు’ అని సంజయ్ సింగ్ ప్రశ్నించారు.
సీఎం కార్యాలయం ముందు నిరసన తెలిపిన బీజేపీ
ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనకు కౌంటర్‌గా బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సీఎం ఆతిషీ నివాసం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. ‘6 ఫ్లాగ్ స్టార్ రోడ్డులోని భవనం సీఎం అతిషీకి కేటాయించారు. నేను ఆమెను ఒక్కటే అడగదలచుకున్నా.. అసలు మీరు ఎప్పుడు ఆ బంగ్లాలోకి వెళ్తారు?’ అని ప్రశ్నించారు.