calender_icon.png 8 October, 2024 | 11:58 PM

కాంగ్రెస్‌ది రైతు ప్రభుత్వం

08-10-2024 12:41:34 AM

వందశాతం రుణమాఫీ అమలు 

దసరా తరువాత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

నల్లగొండ, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్‌ది రైతు ప్రభుత్వమని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో సోమవారం జరిగిన మార్కెట్ కమిటీ పాలకరవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

దసరా తరువాత రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని వెల్లడించారు. తొలి విడత నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 2027లోగా ఎస్సెల్బీసీ సొరంగాన్ని పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తామని హామీ ఇచ్చారు.

జిల్లాకు జీవనాడి లాంటి ఎస్సెల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ తీవ్రనిర్లక్ష్యం చేసిన కారణంగానే ఈ ప్రాంత ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పి ఫాంహౌస్‌కు పరిమితం చేశారని ఎద్దేవాచేశారు. మిషన్ భగీరథ పథకానికి రూ.6 వేల కోట్లు ఖర్చుపెట్టామని చెప్తున్న బీఆర్‌ఎస్ నేతలు ఏ గ్రామానికి సక్రమంగా తాగునీరిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

50 శాతం మంది రైతులకే రుణమాఫీ అయ్యిందని రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామంటున్న మాజీ మంత్రి హరీశ్‌రావుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదు విడుతల్లో చేసిన రుణమాఫీ బ్యాంకు వడ్డీకే సరిపోయిందన్న విషయం గుర్తులేదా అని నిలదీశారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించే అర్హత విపక్షాలకు లేదన్నారు.

మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగిస్తే విపక్షాలు అడ్డు పడడం సిగ్గుచేటని విమర్శించారు. నల్లగొం డ అభివృద్ధికి రూ. 516 కోట్లు కేటాయిస్తే నిధులన్నీ నల్లగొండకే తీసుకెళ్లారని కేటీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. చిం తపల్లి మండలం మాల్ వద్ద నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నిర్మించి ఇక్కడి యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

స్థానిక సంస్థలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అనంతరం పాలకవర్గ సభ్యులతో మంత్రి ప్రమాణం చేయించారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జుమునకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాగార్జున సాగర్, దేవరకొండ ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బాలూనాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.