03-04-2025 12:00:00 AM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండ, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 43, 44వ డివిజన్ పరిధిలోని మామునూర్, తిమ్మాపూర్ పెన్షన్ పూర్, భట్టుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పేదలకు బియ్యం పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు. శ్రీమంతుల తరహాలో పేదలు కూడా సన్నబియ్యం తినాలనే ఆలోచనతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ప్రజా ప్రభుత్వంలో సన్నబియ్యం పథకం ప్రారంభించడం జరిగింది.
ఈ పథకం చరిత్రలో నిలిచి పోతుందని రేపు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి అయిన ఈ పథకాన్ని కొనసాగించాల్సిందే,వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2,70,148 మంది ప్రజలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నట్టు తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ ఎపుడు పేదలకోసమే ఆలోచిస్తుందని,అందుకే వారి ఆకలి తీర్చేందుకు ఈ పథకాన్ని తేవడం జరిగింది.
సోనియాగాంధీ ఆహార భద్రత చట్టం తీసుకొచేందుకు ఎంతో కృషి చేసారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకు ఈ పథకం తేవడం జరిగింది.ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ,జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, కాజీపేట తహసిల్దార్ బావ్ సింగ్, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.