- జార్ఖండ్‌కు జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ అతిపెద్ద శత్రువులు
- రాష్ట్రంలో బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు
- బంగ్లా, రోహింగ్యాలను చేరదీసి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు
- జార్ఖండ్‌లో ఆదివాసీల సంఖ్య వేగంగా తగ్గుతోంది
- జంషెడ్‌పూర్ సభలో ప్రధాని నరేంద్రమోదీ ఆరోపణలు
జంషెడ్‌పూర్ (జార్ఖండ్), సెప్టెంబర్ 15: జార్ఖండ్ రాష్ట్రానికి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీలు అతిపెద్ద శత్రువులని ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేతిలో జేఎంఎం కీలుబొమ్మ అని ఆరోపించారు. జార్ఖండ్‌ను చాలాకాలంగా కాంగ్రెస్ ద్వేషిస్తోందని, రాష్ట్ర ఏర్పాటుపై ఆర్జేడీ ఎప్పటినుంచో ప్రతీకారం కోరుకుంటోందని అన్నారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాల వలసలకు అధికార జేఎంఎం మద్దతుగా నిలవడంతో ప్రతి జార్ఖండ్ వాసి అభద్రతాభావంతో ఉన్నాడని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జంషెడ్‌పూర్‌లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సంతాల్ పరగణలో ఆదివాసీల జనాభా వేగంగా తగ్గుతోందని మోదీ తెలిపారు. జేఎంఎం మద్దతుతో గ్రామాల్లో వలసదారులు పాగా వేస్తున్నారని, భూముల ఆక్రమణ జరుగుతోందని ఆరోపించారు. ఆడబిడ్డలపై దాడులు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. బుజ్జగింపు రాజకీయాల వల్లనే రాష్ట్రంలోకి వలసదారులు, ఉగ్రవాదులు చొరబడుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌తో కలిస్తే ఎవరైనా అంతే
జేఎంఎంతో కాంగ్రెస్ అనే దెయ్యం చేతులు కలిపిన నాటి నుంచి రాష్ట్రంలో చొరబాట్లు పెరుగుతున్నాయి. ఏదైనా పార్టీతో కాంగ్రెస్ జతకూడిందంటే అక్కడ బుజ్జగింపు రాజకీయాలు మొదలవుతాయి. మతం ఆధారంగా ఓటు బ్యాంకు పొందేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు జేఎంఎం కూడా అదే పనిచేస్తోంది. కాంగ్రెస్ చేతిలో హేమంత్ సర్కారు కీలుబొమ్మగా పనిచేస్తూ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారి ప్రయోజనాలను దెబ్బతీసి చొరబాటుదారులకు లబ్ధి చేకూరుస్తోంది. అంతేకాకుండా ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకోవడం, అవినీతిపైనే హేమంత్ పార్టీ దృష్టిసారించింది.
ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా నీరు, అడవులు, భూమి అన్నింటిలో అవినీతికి పాల్పడింది. బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ అక్రమాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం. అందుకే ప్రతి జార్ఖండ్ పౌరుడు రాష్ట్రంలో బీజేపీని బలపరిచేందుకు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. కాగా, జార్ఖండ్ పర్యటనలో ఉన్న మోదీ.. టాటానగర్‌లో దాదాపు రూ.660 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి ఆవాస యోజన (గ్రామీణం) కింద 32 వేల మంది లబ్ధిదారులకు మంజూరు లేఖలను పంచారు.
వందేభారత్ రైళ్ల ప్రారంభం
ప్రధాని నరేంద్రమోదీ ఆరు వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఆదివారం ప్రారంభించిన రైళ్లు టాటానగర్ బ్రహ్మపూర్ రూర్కెలా దేవ్‌గఢ్ భగల్పూర్ గయా మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. వీటి చేరికతో వందేభారత్ శ్రేణిలో రైళ్ల సంఖ్య 60కి చేరుకుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా ప్రారంభమైనన సర్వీసుల ద్వారా దేవ్‌గఢ్‌లోని బైద్యనాథ్‌ధామ్, కాశీ విశ్వనాథ ఆలయం, కాళీఘాట్, కోల్‌కతాలోని బేలూరు మఠం వంటి పుణ్యక్షేత్రాలకు సులభంగా ప్రయాణించవచ్చని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ రైళ్లను జార్ఖండ్ నుంచే మోదీ ప్రారంభించాల్సి ఉన్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన పర్యటన ఆలస్యమైంది. దీంతో వర్చువల్‌గానే రైళ్లను ప్రారంభించారు.