- సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నాం
- తేమ, తాలు పేరుతో ఇబ్బంది పెట్టే మిల్లర్లపై చర్యలు తప్పవు
- ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లతో మంత్రి కొండా వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రుణమాఫీ, సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చి చేతల ప్రభుత్వమని నిరూపించుకున్నామని స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయిన కొండా సురేఖ గురు వారం సచివాలయం నుంచి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్, వల్లూరు క్రాంతి, మిక్కిలినేని మను చౌదరిలతో ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంత్రి సురేఖ మాట్లాడుతూ.. కొనుగోళ్ల తీరుతెన్నులపై ఆరా తీశారు. మిల్లర్లతో మాట్లాడి వీలైనంత త్వరగా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, ధాన్యం నిల్వకు సంబంధించిన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లకు సూచించారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సీజన్‌లో రికా ర్డు స్థాయిలో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని, దీని కోసం ప్రత్యేక కార్యాచరణతో మందుకు వెళ్లాలని సూచించారు.