calender_icon.png 16 April, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమర్జెన్సీ పేరిట కాంగ్రెస్ రాజ్యాంగ హననం

15-04-2025 12:35:42 AM

పౌరుల స్వేచ్ఛ, సాతంత్య్రాలు అణచివేత

ప్రజాస్వామికవాదులు, మేధావులు జైళ్ల పాలు

అంబేద్కర్ జయంతి వేడుకలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాం తి): ఇందిరా ప్రభుత్వ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించి కాంగ్రెస్ రాజ్యాంగ హననానికి పాల్పడిందని, పౌరులను స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించివేసిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్రకార్యాలయంలో సోమవారం నిర్వహించిన జయంతి వేడుకలో ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మంది ప్రజాస్వామికాదులు, ఉద్యమకారులు, మీడియా ప్రతినిధులు జైళ్ల పాలయ్యారని గుర్తుచేశారు.

మళ్లీ జనతా పార్టీ  అధికారంలోకి వచ్చే వరకూ దేశంలో చీకటి రోజులేనని అభివర్ణించారు. ప్రధాని మోదీ 11 ఏళ్లుగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబ పాలన కారణంగా రాజ్యాంగం అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నదని తెలిపారు. రాజ్యాం గాన్ని నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ కుట్రలు చేసిందని ఆరోపించారు. మహామేధావి అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా దేశానికి సేవలందిస్తున్న సమయంలో ఆయన రాజీనామా చేసేవరకూ కాంగ్రెస్ విశ్రమించ లేదన్నారు. దేశానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులు మరణిస్తే, వారి అంత్యక్రియలు ప్రభుత్వమే ఢిల్లీలో నిర్వహించేదని, కానీ.. కాంగ్రెస్ అంబేద్కర్ మరణించినప్పుడు ఆ గౌరవాన్ని కల్పించలేదన్నారు. అంబేద్కర్ పార్థివదేహాన్ని ఢిల్లీ నుంచి ముంబైకి పంపించిందని గుర్తుచేశారు.

అంబేద్కర్ సూచనలను కాంగ్రెస్ పట్టించుకోలేదు: ఎంపీ కే లక్ష్మణ్

కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాటి ప్రధాని నెహ్రూ అడుగడుగునా అంబేద్కర్‌ను అవమానపరిచారని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. అంబేద్కర్ పట్ల ప్రస్తుత ప్రధాని మోదీ అత్యంత గౌరవం చూపుతున్నారని కొనియాడారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370కు వ్యతిరేకంగా అంబేద్కర్ ఆనాడే గళమెత్తారని, ఆ నిర్ణయం దేశ విభజనకు దారితీ స్తుందని హెచ్చరించినా కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదని స్పష్టం చేశారు.

నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ రాజకీయాలను అనుసరించిందని, హిందూ సమాజంలో మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు హిందూ కోడ్ బిల్ రూపొందించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును అడ్డుకున్నదన్నారు.  బీసీల కోసం నియమించిన కాకా కలేల్కర్ కమిషన్ నివేదికను నాటి ప్రధాని నెహ్రూ పరిశీలించకుండా పక్కనపెట్టారని, తర్వాత ఇందిరాగాంధీ హయాంలో మండ ల్ కమిషన్ నివేదిక సైతం బుట్టదాఖలైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలేనని నిప్పులు చెరిగారు.

చంపినోడే సంతాప సభ పెట్టినట్లుంది: బండి

అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పండుగలా నిర్వహించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సూచించడం చంపినోడే సంతాప సభ పెట్టినట్లు ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ విమర్శించారు. కాంగ్రెస్ ఆది నుంచి అంబేద్కర్ ను అవమానిస్తూ వచ్చిందని గుర్తుచేశారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి కూడా అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా అవమానించిందని విమర్శించారు. ఏటా ఏప్రిల్ 14న 120 దేశాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతాయని, అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేయడమంటే ఆయన జీవిత చరిత్రను ఒక గుర్తు చేసుకోవడమేనని అన్నారు. అందుకే బీజేపీ ఆయన విగ్రహాల శుద్ధికి పూనుకొన్నదని వెల్లడించారు.