calender_icon.png 21 October, 2024 | 5:16 AM

నిర్వాసితులపె కాంగ్రెస్‌ది కపట ప్రేమ

21-10-2024 01:36:27 AM

  1. వారి కోసం 2 వేల కోట్లు ఖర్చు పెట్టాం 
  2. ప్రేమ ఉంటే గచ్చిబౌలిలో ఇండ్లు ఇవ్వాలి
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్, అక్టోబరు 20(విజయక్రాంతి): మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్వాసితులపై సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కపట ప్రేమ చూపుతున్నారని మాజీ మంత్రి  హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో   నిర్వాసితులకు  రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ముట్రాజ్‌పల్లిలో 675 ఎకరాల్లో 2,273, తున్కిబొల్లారంలో 1,141ఇండ్లు నిర్మించి ఇచ్చామన్నారు.  రూ.694 కోట్ల నష్టపరిహారం ఇచ్చినట్లు వెల్లడించారు. నిర్వాసితులకు కేసీఆర్ ఒక్క ఇల్లూ కట్టలేదంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కసారి ఆర్‌అండ్‌ఆర్ కాలనీలను సందర్శించాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 2013 చట్టం కన్నా మెరుగైన పరిహారం ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఇళ్లు కట్టుకుంటామన్న వారికి కూడా ప్లాట్లు, రూ.5 లక్షలు ఇచ్చామని, 2013 చట్టం కన్నా ఇది రెట్టింపు ప్యాకేజీ అని వెల్లడించారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ నిర్వాసితుల ఉపాధి కోసం తున్కిబొల్లారం వద్ద 400 ఎకరాల్లో,  వర్గల్‌లో 1,100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేశామని, 4వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.

పరిశ్రమల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిర్మించిన ఇండ్లనే మూసీ నిర్వాసితులకు ఇస్తున్నారని గుర్తు చేశారు. మూసీ నిర్వాసితులపై ప్రేమ ఉంటే గచ్చిబౌలిలో 470 ఎకరాల్లో ఇండ్లు నిర్మించి నిర్వాసితులపై ప్రేమను సీఎం రేవంత్‌రెడ్డి నిరూపించుకోవాలని సవాల్ సిరారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడి పాల్గొన్నారు.