calender_icon.png 24 September, 2024 | 5:55 PM

కాంగ్రెస్‌కు దేశభక్తే లేదు

21-09-2024 02:36:32 AM

  1. నేటి కాంగ్రెస్‌లో అది చచ్చిపోయింది
  2. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానిస్తోంది
  3. తుక్డే తుక్డే గ్యాంగ్ చేతిలో కాంగ్రెస్
  4. మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ

వార్ధా, సెప్టెంబర్  20: విదేశీ గడ్డపై నుంచి భారత్‌ను అవమానించటం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. ఆ పార్టీలో దేశభక్తి చచ్చిపోయిందని ఆరోపించారు. మహారాష్ట్రలోని వార్ధాలో శుక్రవారం నేషనల్ పీఎం విశ్వకర్మ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు గణపతి పూజలనూ సహించలేకపోతున్నారని మండిపడ్డారు. ‘నేటి కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి భావన చచ్చిపోయింది. నేటి కాంగ్రెస్‌లోకి విద్వేష భూతం ప్రవేశించింది.

కాంగ్రెస్ నేతలు విదేశీ గడ్డపై నుంచి ఏం మాట్లాడుతున్నారో చూడండి... వారి జాతి వ్యతిరేక ఎజెండా, సమాజాన్ని విచ్చిన్నం చేసే మాటలు, ఈ దేశ సంస్కృతిని అవమానించే ప్రకటనలు.. తుక్డే తుక్డే గ్యాంగులు, అర్బన్ నక్సల్స్ నడుపుతున్న కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్నది ఇదే. ఆ పార్టీకి గణేష్ పూజ సమస్యగానే మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గణపతి విగ్రహాన్ని పోలీస్ వ్యాన్‌లో పెట్టిన ఘటనను చూశాం’ అని విమర్శించారు.

అబద్ధాల కాంగ్రెస్

అబద్ధాలు చెప్పటంలో కాంగ్రెస్ నేతలు ఆరితేరారని ప్రధాని విమర్శించారు. ‘కాంగ్రెస్ అంటేనే అబద్ధం, మోసం, నిజాయితీ లేనితనం. తెలంగాణలో రైతుల లోన్లు మాఫీ చేస్తామని కాంగ్రెస్‌వాళ్లు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు తమ లోన్ల మాఫీ కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడున్నది పాత కాంగ్రెస్ కాదు. ఇప్పుడు దేశంలో నిజాయితీలేని పార్టీ ఏదైనా ఉందంటే.. అది కాంగ్రెస్ పార్టీయే. దేశంలో అత్యంత అవినీతి కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ రాజకుటుంబమే’ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.