ఎమ్మెల్యే కోవ లక్ష్మి...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi) అన్నారు. లింగాపూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పిన ఎమ్మెల్యే మాట్లాడుతూ... అబద్ధపు హామీలపై గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు పలికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయడమే కాకుండా రైతుల పట్ల చేస్తున్న మోసాలను చూడలేక స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్(KCR) పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కాలంలో ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నారని గుర్తు చేశారు. ప్రజల పక్షానే బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.