calender_icon.png 20 October, 2024 | 1:57 PM

గ్రూప్-1 మెయిన్స్‌పై నేడు కీలక ప్రకటన

20-10-2024 10:25:15 AM

హైదరాబాద్: గ్రూప్‌ వన్‌ మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక ప్రకటన చేయనుంది. రాష్ట్ర మంత్రులు దామోదర రాజ నర్సింహ్మ, డి శ్రీధర్ బాబు, పి ప్రభాకర్, కొండా సురేఖతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం నిర్వహించి గ్రూపు మెయిన్స్ అభ్యర్థులు లేవనెత్తిన సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. ఈ సమావేశంలో న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మూడు గంటలకు పైగా జీఓ నంబర్ 29, జీఓ నంబర్ 55 గురించి న్యాయ నిపుణులు మంత్రులకు వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులపై న్యాయ అభిప్రాయాన్ని సేకరించి గ్రూప్ వన్ మెయిన్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రకటన చేయాలని మంత్రులు నిర్ణయించారు. అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు , ఆందోళనలను కూడా మంత్రి నివృత్తి చేస్తారు .

రాష్ట్రంలో రేపటి నుంచి ఈ నెల 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో గ్రూప్ వన్ మెయిన్స్ కు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లు విధుల్లో ఉండనున్నారు. తొలిసారిగా ప్రశ్నాపత్రాల వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్లలో జిరాక్స్, ఇంటర్ నెట్, దుకాణాలు మూసివేయనున్నారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకూ 144 సెక్షన్ అమలు కానుంది.