calender_icon.png 21 March, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యను అట్టడుగు వర్గాలకు దూరం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

21-03-2025 07:27:13 PM

జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్

కొత్తగూడెం,(విజయక్రాంతి): విద్యను అట్టడుగు వర్గాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూరం చేస్తుందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(Jaibhim Rao Bharat Party) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యా రంగానికి 15 శాతం నిధులను కేటాయిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించి కేవలం 7.57 శాతం కేటాయించి చేతులు దులుపుకున్నారని, ఇటీవల ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లతో ప్రవేశపెట్టి విద్యారంగానికి కేవలం రూ.23,108 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఈ అరకొర నిధులు ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోవని విమర్శించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మ్యానిపెస్టోలో పెట్టిన ప్రతీ మండల కేంద్రానికో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ప్రతీ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల, ప్రతీ జిల్లా హెడ్ క్వార్టర్ లో పీజీ కళాశాల నిర్మించడం ఏలా సాధ్యమవుతుందో రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు.

మెరుగైన రీతిలో ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) ఇస్తామని హామీని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తన 16 నెలల పరిపాలన కాలంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. దాదాపు రూ.8వేల కోట్ల ఫీజ్ రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్స్ పెండింగ్ లో ఉన్నయని అవి విడుదల కాక అనేక మంది విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. ఆర్థిక భారంతో విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నిధులను విడుదల చేయడానికి ప్రత్యేక గ్రాంట్లను విడుదల చేయాల్సిన ప్రభుత్వం అసలు  వాటి ప్రస్తావన చేయకపోవడం మోసపూరిత విధానానికి నిదర్శనమన్నారు.విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 30 శాతం నిధులను కేటాయించాల్సిన ప్రభుత్వం 7.57 శాతం మాత్రమే కేటాయించి విద్యారంగాన్ని ఏ విధంగా బాగు చేస్తారో స్పష్టం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్ పై ఉందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సాయి, పుణెం మురళి,బాబీ, తదితరులు పాల్గొన్నారు.