హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం, ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని కోరుతున్నానని హరీశ్ రావు పేర్కొన్నారు.