calender_icon.png 2 March, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ముడ్ డిఫెన్స్ డిగ్రీ మహిళా కళాశాలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

01-03-2025 10:36:16 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రహీంఖాన్ గూడ లో మహిళా సంక్షేమ ఆర్మీ కళాశాలను ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు అంకుషాపూర్ లోని డిఫెన్స్ ఆర్ముడ్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తూ శనివారం ధర్నాకు దిగారు.  యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రహీంఖాన్ గూడ లో గత ప్రభుత్వ హాయంలో ఆర్ముడ్ సోర్సెస్ ప్రిపరేటరీ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయగా అధికారులోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసేందుకు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం అంకుషాపూర్ కు తరలించినట్లు ఆరోపించారు.

విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో  మరుగుదొడ్లు, స్నానాల గదులు  తక్కువగా ఉండడంతో పాటు అరకొర ఆహార పదార్థాలు అందిస్తున్నట్లు ఆరోపించారు. విద్యార్థునులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎన్నో ఆశలతో ఆర్మీ డిగ్రీ కళాశాలలో  చేర్పించినట్లు పేర్కొన్నారు. ఏడాదిలోనే అమ్మాయిలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షత  చూపుతూ ఆర్మీ కాలేజీని భువనగిరి నుండి ఘట్ కేసర్ కు తరలించారని ఆరోపించారు. ఎందుకు తరలించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. అరకొర సౌకర్యాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమా అంటూ నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫిజికల్ శిక్షణ ఇచ్చే   ట్రైనింగ్ పరికరాలు  వృధాగా పడి ఉన్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిపి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి ఘట్ కేసర్ నుండి మరల బీబీనగర్ కు తరలించి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల తల్లిదండ్రులు కళాశాల గేటు ముందు ధర్నాలు చేయడంతో గేట్లకు తాళాలు వేసి వేశారు. కళాశాల నుండి విద్యార్థులు తమ న్యాయం కావాలని కళాశాల తరలింపు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కళాశాల నుంచి గేటు వద్దకు వచ్చి తాళం విరగొట్టి  తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగారు. తమ న్యాయమైన సమస్యలు  పరిష్కరించాలని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నామని విద్యార్థినులు ఆరోపించారు. డిఫెన్స్ ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాల పరిరక్షణ పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు కాసాగాని ఆంజనేయులు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎర్రపల్లి నరసయ్య, కోశాధికారి పిండి యుగంధర్ ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.