calender_icon.png 8 May, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

21-04-2025 01:07:25 AM

  1. దేశంలో సన్నాలకు బోనస్ ఇస్తున్న తెలంగాణ రాష్ట్రం..
  2. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హనుమకొండ, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): కల్లానికి వచ్చిన ప్రతీ గింజను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదేనని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో ఐ.కే.పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెని రవీందర్ రావు తో కలిసి ప్రారంభించారు.

అనంతరం గ్రామంలో 35లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. అలాగే గర్నేపల్లి గ్రామంలో ఎఫ్.ఏ.సీ.ఎస్ నందనం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  అంతకుముందు గర్నేపల్లి గ్రామంలో 70లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయలు బోనస్ అందిస్తున్నట్లు గుర్తుకు చేశారు. 25లక్షల మంది రైతులకు ఒక ఏడాదిలోనే 21వేల కోట్ల రుణ మాఫీ చేయడంతో పాటు ఉచిత కరెంట్, రైతు భరోసా, 500బోనస్ అందిస్తున్న ఏకైక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. అందుకోసమే రాష్ట్రంలో సన్నాలు పండించే రైతులను ప్రోత్సహస్తుందని అన్నారు. దీనివల్ల మన రైతుల వద్దనే సన్నాలు కోని మళ్ళీ మనకే సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందువలన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్మాలని సూచించారు.

వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదని కావున కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. తేమ 17శాతం ఉండాలని, బస్తా 41కేజీలు మాత్రమే తూకం వేయాలని, ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలని, దళారుల వద్దకు వెళ్లి నష్టపోవద్దని సూచించారు.

బీజేపీ, బిఆర్‌ఎస్ పార్టీలు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నాయాని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు సన్నాలకు బోనస్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఒక అడుగు ముందుకు వేసి రైతు సంక్షేమనికి ప్రభుత్వం కృషి చేస్తుంటే అడ్డు పుల్లలు వేయకుండా సహకరించాలని హితవు పలికారు. వెంకటాపూర్ గ్రామంలో ఇప్పటికే 35లక్షలతో సిసి రోడ్లు పూర్తి చేసుకున్నామని, మరో 50లక్షల సిసి రోడ్లకు త్వరలోనే మంజూరు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ నిధులతో మహిళా భవన నిర్మాణం చేసుకుందామని అలాగే ఎస్సీ కాలనీ రోడ్డు, బోర్ వెల్ ను వీలైనంత తొందరలో ఏర్పాటు చేస్తానని తెలిపారు.

గర్నేపల్లి గ్రామానికి సంబందించి 70 లక్షలతో దాదాపు అన్ని సిసి రోడ్లు పూర్తి చేసుకున్నామని మరో 30లక్షలు కావాలని అడుగుతున్నారు వాటిని కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కట్టా మనోజ్ రెడ్డి, జఫర్ గడ్ పీఏసీఎస్ చైర్మన్  కరుణాకర్ రావు, వ్యవసాయ శాఖ అధికారులు, మహిళా సంఘాలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.