సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి..
కరీంనగర్ (విజయక్రాంతి): కేవలం రాజకీయ ప్రాబల్యం కోసం, స్థానిక సంస్థల ఎన్నికల లబ్దికోసం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి దుయ్యబట్టారు. కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వద్దకు గ్రామసభలు పేరుతో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే తప్ప అర్హులైన లబ్దిదారులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. నిజమైన అర్హులైన లబ్దిదారుల ఎంపికకు అధికారులకు పూర్తి బాధ్యతలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రయోజనాలకు వాడుకోవడం తగదన్నారు. గతంలో ప్రజాపాలనకు చేసిన ధరఖాస్తులనే గ్రామసభల్లో జాబితా తయారు చేసారని, అందులోనూ నిజమైన అర్హులైన వారికి ఇళ్లు, రేషన్ కార్డులు 30 శాతమే చోటు కల్పించారన్నారు. కాంగ్రెస్ మంత్రులు అర్హులందరికీ మంజూరు చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
గతంలో మీసేవలో ధరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రేషన్ కార్డులు మంజూరు చేశారన్నారు. మిగిలిన వారికి రాలేదన్నారు. ఈ పథకాల లబ్దిచేకూరే గ్రామాల్లో గందరగోళంతో పాటు కొట్టుకునే స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పేదవారికి సంక్షేమ పథకాలను ఎంపిక చేయలేదని వాపోయారు. ఈ గ్రామసభలను మరోసారి రెండో విడత చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ ప్రజలను మాయ చేస్తోందన్నారు. ఇవి కేవలం ప్రచారాల ఆర్బాటమేననన్నారు. కాంగ్రెస్ నిర్వాకంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచినందుకు ఆ పార్టీని ఓడించిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అదేమాదిరిగా చేస్తుండడాన్ని ప్రజలు గమనిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఎన్నికల హామీల్లో బాగంగా ఇచ్చిన హామీలన్నీ పెండింగ్లోనే ఉన్నాయన్నారు. పెన్షన్ లు పెండింగ్ లో ఉంచడం వల్ల గ్రామాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు బడ్జెట్ అని చెప్పుకుంటూనే నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేస్తామని హామీలిస్తున్నారని, ఇష్టారీతిన హామీలిస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలను లబ్ది చేకూర్చకపోతే కాంగ్రెస్ ను దోషిగా నిలబెడతామన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ ఆర్టీసిలో కార్గోను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించడమెంటని, అందులో పాత హమాలీలను తీసివేస్తున్నా పట్టించుకోవడం భదాకారమన్నారు. కొత్తగా హమాలీల కోసం లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని రవాణా మంత్రి ఉండి ఎందుకని ప్రశ్నించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు సిపిఐ ఆద్వర్యంలో సమరశీల పోరాటాలు కొనసాగిస్తామన్నారు. సిపిఐ శతజయంతి ఉత్సవాల్లో బాగంగా ఏడాది పాటు గ్రామ గ్రామాన కేంద్ర రాష్ట్ర వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ హక్కుల సాధనకు ఉద్యమ కార్యచరణ చేపడతామన్నారు. ఫిబ్రవరి నుంచి శాఖ, మండల, జిల్లా మహాసభల నిర్వహణకై నిర్మాణ కార్యక్రమాలు రూపొందించనున్నట్లు వెంకటస్వామి పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి,టేకు మల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచన్న యాదవ్, బామండ్ల పెల్లి యుగేందర్, నాయకులు నల్లగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.