calender_icon.png 19 October, 2024 | 7:48 PM

రైతుబంధు ఎగవేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం

19-10-2024 05:56:16 PM

వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేయాలి 

గజ్వేల్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ నాయకులు 

గజ్వేల్ (విజయక్రాంతి): పంట కాలానికి ఎకరానికి రూ.7500 రైతుబంధు చెల్లిస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం పంటకు కూడా రైతుబంధు ఎగవేసే ఆలోచన చేస్తుందని రైతుబంధు రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు దేవి రవీందర్, గజ్వేల్ మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాసులు అన్నారు. శనివారం గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలుస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులను మోసం చేస్తుందన్నారు. రైతులకు రైతుబంధు వేయడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు.

రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పేరుతో రైతుబంధును చెల్లిస్తామని చెప్పి వానాకాలం పంట పూర్తవుతున్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం లేదని ఆరోపించారు. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో కాలం వెల్లదీస్తుందన్నారు. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వానాకాలం పంటకు కూడా రైతు భరోసా చెల్లించలేమని చెప్పడంతో మరోసారి రైతుబంధు ఎగవేతకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు పంటకు ఎకరానికి రూ.7500 రైతుబంధు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ జకియుద్దిన్, కౌన్సిలర్ బొగ్గుల చందు, మాజీ వైస్ ఎంపీపీ  కృష్ణ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటేశం గౌడ్, మాజీ జడ్పిటిసి మల్లేశం, మద్దూరు శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, గంగిశెట్టి రాజు, మరి కంటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.