26-03-2025 12:59:42 AM
ఎమ్మెల్సీ ఎల్ రమణ
జగిత్యాల అర్బన్, మార్చ్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ విమర్శించారు. మంగళవారం జగిత్యాల లోని ఆయన నివాసంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతు లెత్తేసిందన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని కేవలం 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారన్నారు.
ప్రభుత్వం చేతకానితనం వల్ల సమయానికి సాగునీరు, విద్యుత్తు అందక ఎన్నో పంటలు దెబ్బతిన్నాయని,దీనికి తోడు అకాల వర్షం, వడగళ్ల వానతో రాష్ట్రంలో వేలాది ఎకరాల పంట నష్టం జరిగిందని దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పంట నష్ట బాధితులను ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ సందర్శించిన పాపాన పోలేదన్నారు.
ఎస్ ఎల్ బి సి టన్నెల్లో ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందిన వారి శవాలను కూడా ఇంతవరకు బయటకు తీయలేని చేతగాని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చల సందర్భంగా టిఆర్‌ఎస్ శాసన సభ్యులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం జవాబు చెప్పకుండా దాటవేసిందన్నారు. బి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, ఆనందరావు, సాగర్ రావు, వొళ్ళం మల్లేశం, దయ్యాల మల్లారెడ్డి, ఓల్లాల గంగాధర్, గంగారెడ్డి, రాజు, కోరుకంటి రాము తదితరులు పాల్గొన్నారు.