07-02-2025 12:43:49 AM
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలను పెండింగ్‌లో పెట్టారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు మరిన్ని జఠిలమైన సమస్యలు ఎదుర్కుంటున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వస్తున్న ఆ పార్టీ నేతలను గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
వచ్చే టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, ఉపాధ్యాయులు ఆలోచించి బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. వరంగల్ -ఖమ్మం -నల్లగొండ టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి సరోత్తమ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. శుక్రవారం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి తరఫున ప్రాథమిక నామినేషన్ దాఖలు చేస్తున్నామన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులను దగా చేస్తున్న సర్కార్: టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి
ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలను రేవంత్ సర్కారు దగా చేస్తోందని వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి ఆరోపించారు. 6 నెలల్లో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పట్టింపులేనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంద న్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్లను కోరారు.