calender_icon.png 18 January, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ సర్కార్‌వి మోసపూరిత హామీలు

07-12-2024 01:54:44 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

సరూర్‌నగర్‌లో బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

ఎల్బీనగర్, డిసెంబర్ 6: ఆదాయం లేకున్నా మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటి అమలులో పూర్తిగా విఫలమైందని ఈటల విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే శనివారం బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎల్బీనగర్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్డేడియంలో సభ ఏర్పాట్లను బీజేపీ కార్పొరే టర్లు, నాయకులతో కలిసి ఈటల పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. హైడ్రా, మూసీ, రీజినల్ రింగ్ రోడ్డు, ఫార్మాసిటీ తదితర వాటితో ప్రజలు, రైతులకు శాంతిలేకుండా చేస్తున్నారన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై హోదా మరిచి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గణనీయమైన సీట్లు సాధించిందని.. భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఈటల ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే ఆటో, క్యాబ్ డ్రైవర్లు శనివారం నిర్వహిస్తున్న బంద్‌కు బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు ఈటల తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు.. చింతల రామచంద్రారెడ్డి, భేతి సుభాష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, రూరల్ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.