- ప్రజలను మోసం చేయడంలో రెండు పార్టీలు ఒకటే
- రైతు భరోసా సొమ్ము చెల్లించేందుకు టీఎస్‌ఐఐసీ భూముల తాకట్టు
- ఫాంహౌజ్‌లో పడుకునే కేసీఆర్‌కు ప్రతిపక్ష నేత పదవి ఎందుకు?
- కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాం తి): ఇచ్చిన హామీలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ను మించిపోయిందని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.
బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. అధికారంలోకి వచ్చి ఏడాదైనా 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసు అంటూ ప్రతినెలా ఏదో అంశంపై ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు.
స్థానిక సంస్థల ఎన్నికలు తలమీదకు వస్తుండడంతో కొత్తగా రైతు భరోసా పేరుతో మరో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ఇప్పటికే రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.12 వేల చొప్పున మూడు దఫాలుగా రూ.18 వేలు బకాయిపడ్డారని చెప్పారు.
ఈ లెక్కన 70 లక్షల మంది రైతులకు రూ. 19,600 కోట్లు బకాయి అని అన్నారు. ఈ డబ్బులన్నీ జనవరి 26 నాటికి చెల్లిస్తారా లేదా అనే అంశంపై రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
డైవర్షన్ పాలిటిక్స్‌తో దగా..
కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను దగా చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్‌కు గురువు కేసీఆరేనని... ఆయన బాటలోనే కాంగ్రెస్ సర్కార్ నడుస్తోందన్నారు. మార్చిలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.2 వేల కోట్ల పైచిలుకు నిధులు ఆగిపోతాయన్నారు.
అందుకే రైతు భరోసా, రేషన్ కార్డులంటూ కొత్త డ్రామాను తెరపైకి తీసుకొచ్చి ఓట్లు దండుకునే కుట్రకు తెర తీశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసా బంద్ చేస్తార ని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు వద్ద నయాపైసా కూడా లేదని... ఈ నెల జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేదన్నారు.
కేసీఆర్‌కు ప్రతిపక్ష నేత పదవెందుకు
బీఆర్‌ఎస్ పనైపోయిందని, ఆ పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదని, స్థానిక ఎన్నికల్లో బీజీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. ఫాంహౌజ్ కే పరిమితమైతే ప్రధాన ప్రతిపక్ష నేత పదవి ఎందుకు తీసుకున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆ పదవికి రాజీనామా చేసి ఇంట్లో పడుకోవచ్చు కదా అంటూ విమర్శించారు.
మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిఆయన చనిపోతే కూడా కేసీఆర్ వెళ్లలేదని, అసెంబ్లీలో సంతాప తీర్మానానికి పిలిచినా రాలేదన్నారు. ప్రతిపక్ష పదవికి కూడా కేసీఆర్ పనికిరాడని ఆ పదవిని హరీశ్ రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి లాంటి వారికైనా ఇవ్వాలని సూచించారు.
హైదరాబాద్ రెయిన్‌బో ఆస్పత్రి రోగులు చేరితే రూ.లక్షల్లో బిల్లుల పేరుతో దోచుకుంటున్నారని, చిన్న చిన్న రోగాలకు కూడా లక్షల బిల్లులు వేసి ప్రజల రక్తం పీలుస్తున్నట్లు బండి ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.