- హైడ్రా, మూసీ ఇప్పుడు బస్తీలపై ప్రతాపం
- పేదల ఇండ్ల జోలికి వస్తే ఊరుకోం
- మల్కాజిగిరి ఎంపీ ఈటల
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లను కూలగొట్టారని.. ఇప్పుడు బస్తీల్లో ఉన్న ఇండ్ల మీద పడ్డారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. దేశంలో అతిపెద్ద, పురాతన స్లమ్ బాలాజీనగర్, జవహర్‌నగర్ అని, 1985 నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ నివాసముంటున్నారని ఆయన తెలిపారు.
అత్యంత నిరుపేదల ఇండ్లపైనా సర్కార్ ప్రతాపం చూపిస్తోందని ఆయన విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడుతూ.. స్థలాలు కొని ఇండ్లు నిర్మించుకున్న పేదలపై ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ, యూపీ, బెంగాల్, బిహార్, ఆంధ్రా నుంచి వచ్చి సెటిల్ అయిన వారు ఇక్కడ ఉన్నారని...
వీరంతా ఇక్కడ స్థలం కొనుక్కుని ఇండ్లు కట్టుకున్నారని తెలిపారు. 1941 లో సైనికుల కోసం 5977.3 ఎకరాల భూమిని రూ.4.50 లక్షలకు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సేకరించి ఇచ్చిందన్నారు. ఈ భూమి 1948 వరకు సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ ఆధీనంలో ఉండేదన్నారు. నిజాం పాలన ముగిసి స్వాతంత్రం వచ్చాక.. సైనికుల సొసైటీకీ 1951 కేంద్రం అప్పగించిందన్నారు.
ఈ భూమికి రాష్ట్రప్రభుత్వాన్ని కేర్‌టేకర్‌గా మాత్రమే నియమించిందని చెప్పారు. కానీ ఈ భూమికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఇది పూర్తిగా రక్షణ శాఖకు సంబంధించిన భూమి అని ఈటల తెలిపారు. సైనికులు అమ్ముకుంటే పేదలు కొనుక్కున్నారని తెలిపారు.
1994 గుడిసెలు కూల్చివేయాలని అప్పటి రెవెన్యూ మంత్రి కమతం రామిరెడ్డి ఆదేశిస్తే టైగర్ నరేంద్ర నాయకత్వంలో ఎదురుతిరిగి ఆపేసినట్లు గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఆ ఇండ్లన్లు కూలగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెవెన్యూ ఆగడాలు పెరిగిపోయాయి..
రెవెన్యూ అధికారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ఆగడాలు పెరిగిపోయాయని, తమ ఇండ్లను ఎప్పుడు కూలగొడతారోనని బస్తీవాసులు భయపడుతున్నారని ఈటల తెలిపారు. 1998లో అరుంధతీనగర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న 1,705 మందికి భూములు ఇచ్చారని.. ఆ ఇళ్లను ఇప్పుడు కూలుస్తామని బెదిరిస్తున్నారని వెల్లడించారు.
అధికారులు లంచాలకు మరిగినా రేవంత్ సర్కార్ చేష్టలుడిగి చూస్తోందని ఆరోపించారు. ఈ స్థలాలపై మాజీ సైనికులు కోర్టుకుపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని తెలిపారు. అయినా ఈ సర్కారుకు బుద్ధి రాలేదన్నారు. ఇక్కడ ఎంపీగా పనిచేసిన రేవంత్‌రెడ్డికి అన్నీ తెలిసి పేదలపై ప్రతాపం చూపిస్తున్నాడని ఆరోపించారు. పేదల జోలికి వస్తే ఎంతవరకైనా సిద్ధమని, చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.