calender_icon.png 2 October, 2024 | 5:27 AM

కేటీఆర్‌పై కాంగ్రెస్ గుండాల దాడి

02-10-2024 01:22:49 AM

పోలీసుల కనుసన్నల్లోనే ఘటన 

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణ

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): పోలీ సు కనుసన్నల్లోనే పథకం ప్రకారం బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై దాడి జరిగిందని, ట్రాఫిక్ సిగ్నల్‌ను ఆపి మరి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు పోలీసులు సహకరించారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాం త బాధితులను కలిసేందుకు వెళ్లిన ఆయన కాన్వాయ్‌పై దాడి చేయడం కాంగ్రెస్ పాలనకు పరాకాష్ట అన్నారు.

కేటీఆర్ కారుపై ఎక్కి దాడికి పాల్పడే ప్రయత్నం చేశారని, ఆయనతోపాటు బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడు తూ.. ౩ నెలలుగా బీఆర్‌ఎస్ ముఖ్య నేతలపై కాంగ్రెస్ దాడులు చేస్తోందని, వరద బాధితులు, మూసీ నిర్వాసిత బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ ఎస్ నేతలపై దాడి చేయడం సరికాదన్నారు.

ఎన్నికల ఫలితాల తరువాత గ్రామస్థాయిలో కార్యకర్తలపై దాడులు చేశారని, సిద్దిపేటలో హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేశారని, ఖమ్మంలో వరద బాధితుల వద్దకు వెళ్తే.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నేతలను భయాందోళనకు గురిచేసి పాలన సాగించేందుకు రేవంత్ ఎత్తుగడలు వేశారని.. డీజీపీ, నగర పోలీసు కమిషనర్ సీనియార్టీ నిరూపించు కోవాలని సూచించారు.

రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో తాము లిస్టు తయారు చేస్తున్నామని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉండరని, కాంగ్రెస్‌ను స్పెషల్ పర్పస్ వెహికల్‌లా మార్చుకున్నారని విమర్శించారు.

గత కాంగ్రెస్ పాలకులు ధ్వంసం చేసిన హుస్సేన్‌సాగర్, మూసీలను కేసీఆర్ ప్రభుత్వం కాపాడిందని అన్నారు. ఎస్టీ నిర్మాణాలతో మురుగు నీరు వాసన లేకుండా చేసిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ దాడులకు భయపడే ప్రసక్తిలేదని చెప్పారు.