calender_icon.png 21 September, 2024 | 6:22 PM

బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం

21-09-2024 12:10:00 AM

మండలి ప్రతిపక్షనేత మధుసూదనా చారి

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ శాసనమండలి పక్షనేత ఎస్. మధుసూదన చారి విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, పల్లె రవికుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ కోసం జరుగుతున్న పోరా టంతోనే మహేశ్ కుమార్ గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్నారు. ప్రతి ఏటా బీసీలకు రూ. 20 వేల కోట్ల కేటాయింపు చేస్తామని చెప్పి అందులో సగం కూడా కేటాయించలేదని మండిపడ్డారు. పీసీసీ అధ్య క్షుడిగా వారం రోజులు కూడా గడవలేదని, అపుడే దమ్ముందా అని పీసీసీ చీఫ్ మహేశ్  మాట్లాడడం తగదని హితవు పలికారు.

నిఖార్సయిన కాంగ్రెస్‌వాది వి.హనుమంత రావును కాదని అన్ని పార్టీల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీఎంను చేసిందని విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత కాంగ్రెస్ బండారం బయట పడుతుందని చెప్పారు. దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ బీసీల గణన చేయలేదని, చరిత్రలో బీసీలను కేవలం ఓట్ల కోణంలోనే చూసి దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా అమలయ్యే వరకు తమ పార్టీ పోరాడుతుందని, బీసీలను ఓటు బ్యాంకుగా చూడవద్దని సూచించారు.

కేసీఆర్ పాలనలో బీసీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారని, దేశంలో మెజార్టీ ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని 2004లోనే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరినట్లు గుర్తు చేశారు. రాజకీయంగా కూడా బీసీలకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని, తొలి ప్రభు త్వంలోనే రెండు చట్టసభల అత్యున్నత పదవులను బీసీలకు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. పలుకుబడి ఉంటే మహేశ్ కుమార్ బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు సీఎంపై ఒత్తిడి తేవాలని సూచించారు.