13-02-2025 02:21:10 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీ మేరకు కులగణన నిర్వహించిం ది.
కాగా క్షేత్రస్థాయిలో కులగణన, వర్గీకరణ అంశాల్లో పార్టీకి ఇంకా సానుకూలత రాలేదని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. కులగణనతో బీసీ జనాభా తగ్గించి చూపించారనే వాదన ఒక వైపు ఉంటే.. ఎస్సీ వర్గీకరణ ప్రకారం గతంలో 4 గ్రూప్‌లుగా ఉన్న ఎస్సీలను కాంగ్రెస్ మూడు గ్రూప్‌లుగా విభజించించడం వల్ల రిజర్వేషన్లు అంటే ఎంటో తెలియని కులాలకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్సీలను నాలుగు గ్రూప్‌లు విభజించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాది గ కూడా డిమాండ్ వినిపిస్తున్నారు. ఈ రెండు విషయాల్లో పార్టీ ముందే తేరుకోకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందనే భయం హస్తం పార్టీని వెంటాడుతోంది. కాగా, కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కంటే బీసీల జనాభా పెరిగిందని, ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో కొన్ని తప్పిదాలు జరిగాయనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలోని కొందరు దళిత నేతల్లో వ్యక్తమవుతుంది. మరో వైపు బీసీ నాయకులు కూడా గతం కంటే బీసీ జనాభాను 20 లక్షల మేర తగ్గించి చూపారని వాదిస్తున్నారు. ఈ విషయంలో సొంత పార్టీ నాయకులను సముదాయించి, ఆ తర్వాత ప్రజలకు పూర్తిగా వివరిచాల్సిన అవసరం ఉందని, లేదంటే నష్టం జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ అంచనాకు వచ్చింది.
కులగణనపై సూర్యాపేట, ఎస్సీ వర్గీకరణపై గజ్వేల్‌లో భారీ సభలు నిర్వహించాలని కాం గ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. సూర్యాపేట సభ కు రాహుల్ గాంధీ, గజ్వేల్ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానించాలని యోచిస్తున్నారు. కాగా పంచాయతీ ఎన్నికల బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని హస్తం భావిస్తోంది.
రేపు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
వర్గీకరణ, కులగణన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్టీ నాయకుల కు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీభవన్ ఆవరణలోని ప్రకాశం హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ నేతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ హాజరుకానున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వర్గీకరణ, కులగణన సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, మల్లు రవితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తదితరులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
వీరితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ బాధ్యులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పీసీసీ ఆఫీస్ బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, మాజీమంత్రుల, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అనుబంధ సంఘాలతో పాటు మండల కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారు.