గజ్వేల్ (విజయక్రాంతి): కామారెడ్డిలో బిసి డిక్లరేషన్ సభలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరుతో కాలయాపన చేస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్ నర్సింగరావు ఆరోపించారు. శనివారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీసీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, ఇప్పుడు కులగణన పేరుతో కాలయాపన చేస్తుందన్నారు.
రాజ్యాంగ రచనలోనే బీసీలకు అన్యాయం జరిగిందని, ఎన్నో ఏళ్లుగా విద్యా, సామాజిక, రాజకీయపరంగా బీసీలు వెనకబడ్డారని ఆనాడే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్తు ప్రభుత్వాలు వెనుకబడిన తరగతులకు తగు అభివృద్ధి చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 కి కట్టుబడి జనవరి 29 1953 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కాకా కలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేశారని, ఆ రిపోర్టు ప్రకారం వెనుకబడిన తరగతులకు విద్యా ఉద్యోగాల్లో 70 శాతం రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నప్పటికీ దాన్ని అమలు చేయలేదన్నారు. అదేవిధంగా జనతా ప్రభుత్వం బీసీల స్థితిగతులపై అధ్యయనానికి మండల కమిషన్ ఏర్పాటు చేస్తే రిపోర్టును తెప్పించుకొని పట్టించుకోలేదని, వి.పీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తే ఆ ప్రభుత్వాన్ని కూల్చి వేశారన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తే గాని బీసీలకు రిజర్వేషన్ అందలేదు కానీ ఉన్నత వర్గాలకు చెమట చుక్క చిందకుండా ఎటువంటి పోరాటం చేయకుండా ప్రధాని మోదీ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఏకవక్ష నిర్ణయంతో ఓసీలకు రిజర్వేషన్లు తీసుకువచ్చారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి విషయానికొస్తే కమిషన్లు కమిటీలతో పేరుతో కాలయాపన చేసే ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ విషయంలో ఏ మాత్రం బెనుకు లేకుండా అమలు చేస్తున్నాయన్నారు. ఓసీల విషయంలో తక్షణ నిర్ణయాలు తీసుకున్నట్లుగానే బీసీల రిజర్వేషన్లను వెంటనే ప్రభుత్వాలు తేల్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ నాయకులు మల్లేశం గౌడ్, ఆర్కే శ్రీనివాస్, కరీం, రామకృష్ణ, ప్రవీణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.