17-04-2025 12:04:56 AM
రజతోత్సవ సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 16 ( విజయక్రాంతి): కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాన్ని గ్రామ గ్రామాన వివరించి ఎండగట్టాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనెల 27న వరంగల్ లో నిర్వహించనున్న బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని బుధవారం జగిత్యాల జిల్లా బిఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదని, తెలంగాణ ఇస్తాని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు తప్పుడు వాగ్దానాలతో మళ్లీ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఉచిత బస్సు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నదన్నారు.
ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల సీట్లు దొరకని పరిస్థితి ఉందన్నారు. ఉచిత బస్సు ఇచ్చాం కానీ బంగారం మాత్రం ఇవ్వమని రేవంత్ రెడ్డి అంటున్నారన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారని, ఒక బస్సు ఇచ్చి బంగారాన్ని తుస్సు చేశారని మండిపడ్డారు.రుణ మాఫీ, రైతు భరోసా 50 శాతం మందికి ఇంకా రానేలేదన్నారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణులను కోరారు. పసుపు బోర్డును తూతూమంత్రంగా ఏర్పాటు చేశారని, కానీ దానికి చట్టబద్ధత కల్పించకపోవడంతో పసుపు బోర్డుకు బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి డబ్బులు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారని, ప్రస్తుతం పసుపు ధర చాలా తక్కువగా ఉందని బోర్డు నుంచి ఎంతమంది రైతులకు డబ్బులు ఇచ్చారని ప్రశ్నించారు.
రెండు కోట్ల ఉద్యోగాలు, బోర్డుకు చట్టబద్ధత, మనిషికి 15 లక్షలు ఏమయ్యాయని అడిగితే ఎంపీ అర్వింద్ మైకు ముందు పిచ్చి మాటలు మాట్లాడుతారని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా.. కేంద్రం బడ్జెట్ లో తెలంగాణ కు 8 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణను కాపాడేది కేవలం బీఆర్‌ఎస్ పార్టీ, గులాబీ జెండా మాత్రమేనని అన్నారు రజతోత్సవం గుజాబీ పండగ మాత్రమే కాదు... ఇది తెలంగాణ పండగ అని అభివర్ణించారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటడానికి కేసీఆర్ పార్టీ పెట్టారని, తెలంగాణ ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ పెట్టకముందు తెలంగాణ యాస మాట్లాడే పరిస్థితి లేదని, 2001 నుంచి ఎన్నో అవమానాలు, కష్టాలను భరించి బీఆర్‌ఎస్ నిలబడిందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎంపీ అర్వింద్ కలిసిమెలసి ఢిల్లీతో తిరుగుతున్నారని, దీంతో సంజయ్ బీజేపీలో చేరారా లేదా కాంగ్రెస్ లో చేరారా అన్న అనుమానం వస్తుందన్నారు. సంజయ్ ఒక సారి సీఎం రేవంత్ రెడ్డితో... మరొక సారి బీజేపీ వాళ్లతో కనిపిస్తారని, ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, రాజేశం గౌడ్, ఓరుగంటి రమణారావు, లోక బాపురెడ్డి, గట్టు సతీష్, శీలం ప్రియాంక, వొళ్ళం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.