02-04-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 1: (విజయ క్రాంతి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ, బీసీల దశాబ్దాల కల అయిన బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు యావత్ తెలంగాణ బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉం టుందని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు.
ఈ మేరకు మంగళవారం ఆయన న్యూడిల్లీలోని తెలంగాణ భవన్లో బీసీ సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీల పక్షపాతి అని, దేశ ప్రధాని పీఎం మోదీ కూడా బీసీ అని బీజేపీ నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నారని, మరి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ నాయకులు బీసీల వైపు ఉంటారో, అగ్రవర్ణాల వైపు ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
దేశంలో కులగణన చేపడతామని చెప్పి మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఆ హామీని నెరవేర్చకుండా కనీసం కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయని దుస్థితిలో ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల సమయం లో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీర్మానం చేయడం హర్షణీయమన్నారు.
అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లును పార్లమెంటులో కూడా ఆమో దం తెలపాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సంఘాల నాయకులు బుధవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనున్న మహా ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక రైల్లో తెలంగాణకు చెందిన బీసీ నాయకులంతా వస్తున్నారని, అన్ని సంఘా లు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. రిజర్వేషన్లు ఎవరిచ్చే బిక్ష కాదని, ఇది బీసీల హక్కు అని, పార్లమెంటు మీద ఒత్తిడి పెంచి 42 శాతం బీసీ రిజర్వేషన్లకు ఆమోదం పొందేలా పోరాడాలని అన్ని పార్టీల, సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, ఓబీసీ మేధావుల ఫోరం జాతీయ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ, ఎంబిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బడేసాబ్, బీసీ పొలిటికల్ జెఎసి యువజన విభాగం అధ్యక్షుడు చింతపల్లి సతీష్, నాయకులు వివి గౌడ్, అంజన్న యాదవ్, దేవర శివ, రాఘవేందర్, రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.