calender_icon.png 2 November, 2024 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ కౌంటర్ ఉద్యమాలు

02-11-2024 12:00:00 AM

  1. సర్కార్‌కు మద్దతుగా ‘మూసీ పరివాహక రైతులు ఆత్మీయ సమ్మేళనం’  
  2. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ యాత్రలు 
  3. బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేలా అధికార కాంగ్రెస్ వ్యూహాలు 
  4. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయడమే లక్ష్యం 

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి) : మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీలు చేపడుతున్న ఆందోళనలు, ధర్నాలకు  వ్యతిరేకంగా అధికార కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఆందోళనలు చేపడుతోంది.

మూసీ సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చుతోందని ఆరోపిస్తూ పరిసర ప్రాంత ప్రజలతో కలిసి సర్కార్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నిత్యం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవడంలో భాగంగా మూసీ ప్రక్షాళనకు అనుకూంగా ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల రైతులు, ప్రజలతో కలిసి ‘మూసీ పరివాహక రైతుల ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో అధికార పార్టీ ఇప్పటికే పాదయాత్రలు ప్రారంభించింది.

భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, వేములు వీరేశం, మందుల సామేల్‌తో పాటు సూర్యాపేట నియోజక వర్గ నాయకులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డిలోని ఉప్పల్, మేడ్చల్, ఇబ్రాహీంపట్నం, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లోనూ ఆందోళనలు చేపట్టేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధం అవుతున్నారు.

నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు మూసీ ప్రక్షాళనకు అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూసీ నీటితో  నల్లగొండ జిల్లాలోని లక్షలాది ఎకరాల్లోని పంటలు, తాగునీళ్లు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా జిల్లా ప్రజలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారని కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఈక్రమంలో మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్‌లో ఎంత ఎక్కువగా ఆందోళనలు చేస్త్తే.. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఆ పార్టీకి అంత ఎక్కువ నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి అదనంగా మరింత లాభం చేకూరుతుందని అంటున్నారు.

గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్ పార్టీ ఆందోళనలు చేస్తోందని.. కాంగ్రెస్ కౌంటర్ పోరాటాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీకి తీవ్ర నష్టం తప్పదనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మూసీ ప్రక్షాళలన అనుకూల కార్యక్రమాలు చేపట్టడంలో స్పీడు పెంచింది.

మూసీ సుందరీకరణకు బీఆర్‌ఎస్ హయాంలోనే కార్పోరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీరెడ్డికి బాధ్యతలు అప్పగించిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో కమీషన్ల కోసమే కాంగ్రెస్ మూసీ ప్రక్షాళను చేపడుతోందంటూ బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను హస్తం నేతలు బలంగా తిప్పికొడుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కమీషన్లు దండుకున్న చరిత్ర బీఆర్‌ఎస్‌కు ఉందని, వాళ్ల అలవాట్లను తమకు అపాదిస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు.

మరోవైపు వికారాబాద్‌లో ఇటీవల కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంఖుస్థాపన చేసిన నేవి రాడార్ విషయంలోనూ బీఆర్‌ఎస్ సెల్ఫ్‌గోల్ వేసుకుందనే చర్చ జరుగుతోంది. నేవి రాడార్ ఏర్పాటుకు బీఆర్‌ఎస్ హయాంలోనే జీవో జారీ అయిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందనే మాటలు వినిపిస్తున్నాయి.